Shorts శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తికి చెందిన యువ అథ్లెట్ పత్తి నిత్య హాసిని జాతీయ స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో అద్భుత ప్రతిభ కనబరిచి సత్తా చాటింది. పుదుచ్చేరిలో అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన సౌత్ జోన్ జూనియర్ అథ్లెటిక్స్ నేషనల్ ఛాంపియన్‌షిప్–2026లో ఆంధ్రప్రదేశ్ తరఫున నిత్య హాసిని పాల్గొంది. శ్రీకాళహస్తిలోని నిత్య ఫిట్‌నెస్ సెంటర్ నిర్వాహకులు జ్యోతిరావు, రూపాదేవి దంపతుల కుమార్తె అయిన నిత్య హాసిని.. షాట్‌పుట్, డిస్కస్ త్రో విభాగాల్లో పోటీపడింది. రెండు విభాగాలకు ఎంపికైన ఏకైక బాలికగా నిలిచిన నిత్య.. షాట్‌పుట్‌లో 12.12 మీటర్లు విసిరి ద్వితీయ స్థానంలో నిలిచి సిల్వర్ మెడల్ సాధించింది. అలాగే డిస్కస్ త్రోలో 33.85 మీటర్లు విసిరి నాలుగో స్థానాన్ని కైవసం చేసుకుంది. రాష్ట్ర స్థాయి పోటీల్లో షాట్‌పుట్‌లో 11.21 మీటర్లు సాధించిన నిత్య.. జాతీయ స్థాయిలో తన ప్రదర్శనను 12.12 మీటర్లకు మెరుగుపరుచుకుని ఏకంగా 91 సెంటీమీటర్ల పురోగతి సాధించింది. డిస్కస్ త్రోలోనూ రాష్ట్ర స్థాయిలో 31.40 మీటర్లు సాధించగా, జాతీయ స్థాయిలో 33.85 మీటర్లు విసిరి తన ప్రతిభను మరింత మెరుగుపరుచుకుంది. కొంతకాలంగా రొటేషనల్ టెక్నిక్‌పై ప్రత్యేక శిక్షణ పొందుతున్న నిత్య హాసిని ప్రతి పోటీలోనూ తన ప్రదర్శనను మెరుగుపరుచుకుంటూ జాతీయ స్థాయిలో గుర్తింపు సాధిస్తోంది. తన విజయానికి సహకరించిన కోచ్‌లు, తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులకు నిత్య హాసిని కృతజ్ఞతలు తెలిపింది. నిత్య హాసిని జాతీయ స్థాయిలో సిల్వర్ మెడల్ సాధించడంపై కోచ్‌లు, తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, సిబ్బంది హర్షం వ్యక్తం చేసి అభినందనలు తెలిపారు. శ్రీకాళహస్తి పట్టణవాసులు సైతం నిత్య హాసిని విజయాన్ని ప్రశంసిస్తూ.. భవిష్యత్తులో మరిన్ని జాతీయ, అంతర్జాతీయ స్థాయి విజయాలు సాధించాలని ఆకాంక్షించారు