Shorts మధురవాడ (విశాఖపట్నం): విశాఖ నగరంలో వీధికుక్కలు పిచ్చిగా ప్రవర్తిస్తూ ప్రజలపై పంజా విసురుతున్నాయి. జీవీఎంసీ మధురవాడ జోన్ పరిధిలోని డి-మార్ట్ సమీపంలో ఆడుకుంటున్న ఐదేళ్ల పసివాడిపై వీధికుక్కల గుంపు విచక్షణారహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. అధికారుల అలసత్వం, పట్టింపులేనితనమే ఈ ఘోరానికి కారణమని, ప్రజా ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని స్థానికులు తీవ్ర ఆగ్రహజ్వాలలు వ్యక్తం చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా గొప్పిలి గ్రామానికి చెందిన వడ్డీ దుర్గారావు, సోహిత దంపతులు బతుకుదెరువు కోసం మధురవాడకు వలస వచ్చి కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. వీరి ఐదేళ్ల కుమారుడు కిరణ్ కుమార్ అంగన్‌వాడీలో చదువుతున్నాడు. ఈ నెల 14వ తేదీ సాయంత్రం 4 గంటల సమయంలో ఇంటి వద్ద ఆడుకుంటున్న కిరణ్‌పై ఒక్కసారిగా కుక్కల గుంపు విరుచుకుపడింది. పిచ్చిగా కొరుకుతున్న కుక్కల బారి నుండి బాబును కాపాడేందుకు తల్లి, దారిన వెళ్లే వాహనదారులు సాహసించి కుక్కలను తరిమికొట్టారు. తీవ్ర రక్తస్రావంతో ఉన్న బాలుడిని మధురవాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి, ఆపై పరిస్థితి విషమంగా ఉండటంతో '108'లో విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. ప్రస్తుతం బాలుడు అత్యవసర చికిత్స పొందుతున్నాడని, ప్రాణాపాయం తప్పిందని వైద్యులు వెల్లడించారు. మధురవాడ వ్యాప్తంగా వీధికుక్కల బెడద తీవ్రస్థాయికి చేరినా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంపై యువత, ప్రజలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. వీధుల్లో చిన్నారులు, వృద్ధులు అడుగుపెట్టాలంటేనే వణికిపోతున్నారు. ప్రజా క్షేమాన్ని గాలికి వదిలేసిన జీవీఎంసీ యంత్రాంగం తక్షణమే స్పందించి కుక్కల నియంత్రణకు కఠిన చర్యలు తీసుకోకపోతే, మధురవాడ జోనల్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని యువజన సంఘాలు, స్థానికులు తీవ్ర స్థాయిలో హెచ్చరిస్తున్నారు. విశాఖపట్నంలో 25 ఏళ్లకు పైగా నిఖార్సైన జర్నలిజం ప్రయాణం. వైజాగ్ ప్రాంతీయ సమస్యలపై ప్రత్యేక విశ్లేషణలు అందించే ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’