రూఫ్ స్టోన్ వాల్ కుప్పకూలి కంటిన్యూయస్ మైనర్ యంత్రం ధ్వంసం గోదావరిఖని, ఆంధ్రప్రభ: పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్ పరిధిలోని గోదావరిఖని సింగరేణి బొగ్గు గనిలో ఆదివారం రాత్రి ప్రమాదం చోటుచేసుకున్నట్లు సమాచారం. 11 ఏ గనిలో రూఫ్ స్టోన్ వాల్ ఒక్కసారిగా కుప్పకూలడంతో అక్కడ పనిచేస్తున్న కంటిన్యూయస్ మైనర్ యంత్రాల్లో ఒకటి భారీగా దెబ్బతిన్నట్లు తెలిసింది. ఘటనతో గనిలోని కార్మికులు, ఉద్యోగులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈ గనిలో బ్లాస్టింగ్ లేకుండా ఆధునిక సాంకేతికతతో బొగ్గును వెలికితీస్తున్నారు. రిమోట్ కంట్రోల్ ఆధారిత విధానంలో పనిచేసే రెండు కంటిన్యూయస్ మైనర్ యంత్రాలను గనిలో వినియోగిస్తున్నట్లు సమాచారం. అయితే వీటిలో ఒక యంత్రంపై రూఫ్ స్టోన్ వాల్ కూలిపోవడంతో అది ధ్వంసమైనట్లు తెలుస్తోంది. కుప్పకూలిన రాతి గోడ కింద చిక్కుకున్న భారీ యంత్రాన్ని బయటకు తీసేందుకు సింగరేణి యంత్రాంగం చర్యలు చేపట్టినట్లు సమాచారం. కంటిన్యూయస్ మైనర్ యంత్రం విలువ సుమారు రూ.2 కోట్ల వరకు ఉంటుందని చెబుతున్నారు. దీంతో ఆస్తి నష్టంపై కూడా అధికారులు అంచనా వేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రమాదం జరిగిన సమయంలో ఆ ప్రాంతంలో కార్మికులు పనిచేస్తున్నారా? ఎవరైనా గాయపడ్డారా? అన్న విషయాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. గతంలో కూడా ఇదే గనిలో రూఫ్ వాల్‌కు సంబంధించిన ఘటనలు చోటుచేసుకున్నట్లు సమాచారం. ఈ ప్రమాదానికి గల కారణాలు, పూర్తి నష్టం, ఇతర వివరాలపై సింగరేణి అధికారుల నుంచి అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది