Kaizer News

Kukunoor: రోడ్లకు అడ్డంకులు.. పట్టించుకోని పంచాయతీ

Kukunoor: రోడ్లకు అడ్డంకులు.. పట్టించుకోని పంచాయతీ అధికారులు!

· State - Telangana · hmtvlive.com

Kukunoor: కుక్కునూరు మండలంలోని పెదరాయిగూడెం గ్రామంలో అంతర్గత రహదారులపై కొందరు ఇష్టారాజ్యంగా మట్టి కుప్పలు, ఇసుక కుప్పలు, సిమెంట్‌ స్తంభాలు, ఇటుకలు తదితర నిర్మాణ సామగ్రిని రోడ్డుకు అడ్డంగా ఉంచడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. గ్రామంలోని పలు అంతర్గత రహదారులపై నిర్మాణ సామగ్రిని అడ్డంగా ఉంచడంతో రోడ్లు ఇరుకుగా మారి ద్విచక్ర వాహనాలు, ఆటోలు, ఇతర వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోందని గ్రామస్థులు చెబుతున్నారు. రాత్రి వేళల్లో అడ్డంగా ఉన్న సామగ్రి కనిపించక ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని పలుమార్లు పంచాయతీ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోలేదని గ్రామస్థులు వాపోతున్నారు. ఫిర్యాదులు చేసినప్పటికీ అధికారులు స్పందించకపోవడంతో రహదారులపై అడ్డంకులు యథావిధిగా కొనసాగుతున్నాయని అంటున్నారు. అధికారుల నిర్లక్ష్యంతో రోడ్లపై మట్టి కుప్పలు, ఇసుక కుప్పలు, ఇటుకలు తదితరాలను ఉంచిన కొందరు “మీ దిక్కునకాడ చెప్పుకోండి.. ఎవరు వచ్చి వీటిని తీయిస్తారో చూస్తాం” అంటూ బహిరంగంగానే సవాల్‌ చేస్తున్నారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. దీంతో గ్రామంలో పంచాయతీ అధికారుల పర్యవేక్షణపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజల రాకపోకలకు ఉపయోగపడాల్సిన రహదారులను అడ్డుకోవడం సరికాదని గ్రామస్థులు పేర్కొంటున్నారు. పంచాయతీ అధికారులు వెంటనే గ్రామంలోని అంతర్గత రహదారులను పరిశీలించి, రోడ్లపై ఉన్న మట్టి, ఇసుక కుప్పలు, సిమెంట్‌ స్తంభాలు, ఇటుకలను తొలగించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. అలాగే రహదారులపై నిర్మాణ సామగ్రిని ఉంచి ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్న వారిపై తగిన చర్యలు తీసుకుని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పర్యవేక్షణ పెంచాలని కోరుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి గ్రామాల్లోని అంతర్గత రహదారులను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేస్తున్నారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News