Shorts గుంటూరు: గుంటూరు జిల్లాలో ఎల్నీనో కారణంగా వర్షాలు సకాలంలో కురవకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, సాగు నీరు సరిగా అందక వేసిన వరి పంట కూడా ఎండి పోతుందని గుంటూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం అధ్యక్షుడు కొమ్మినేని దుర్గా ప్రసాద్ అన్నారు. వారి స్వగ్రామం కట్రపాడులో మాట్లాడుతూ వర్షాభావ పరిస్థితుల కారణంగా పంటల సాగు, దిగుబడిపై ప్రతికూల ప్రభావం పడటంతో రైతులు పెట్టిన పెట్టుబడులు కోల్పోయే పరిస్థితి నెలకొంది అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇకనైనా మొద్దు నిద్ర వీడి వెంటనే గుంటూరు జిల్లాలో అన్ని మండలాలలో వర్షాభావ పరిస్థితులపై తక్షణమే సమగ్ర పంట నష్టం సర్వే నిర్వహించి కరువు మండలాలు ప్రకటించి నష్టపోయిన ప్రతి రైతుకు నష్ట పరిహారం అందించాలని, పంట రుణాలను రీషెడ్యూల్ చేసి, కొత్త రుణాలు ఇవ్వాలని, బకాయి ఉన్న పంటల బీమా పరిహారాన్ని కూడా వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా పశువులకు తాగునీరు, పశుగ్రాసం వంటి అత్యవసర సదుపాయాలను రాష్ట్ర ప్రభుత్వం కల్పించాలన్నారు. రైతుల కష్టాలను కేవలం గణాంకాలుగా కాకుండా మానవీయ కోణంలో చూడాలని, వర్షాభావంతో నష్టపోతున్న రైతులను తక్షణమే ఆదుకునేందుకు ప్రత్యేక సహాయ ప్యాకేజీ ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అన్నారు