Kaizer News

Nigar Sultana | జట్టుకు, దేశానికి చాలా చేయాలనుంది.

Nigar Sultana | జట్టుకు, దేశానికి చాలా చేయాలనుంది.. కెప్టెన్‌గా ఆఖరి మ్యాచ్ అదే..!

· Sports · ntnews.com

Nigar Sultana : ఆసియా క్రీడల సెమీఫైనల్లో ఓటమి అనంతరం బంగ్లాదేశ్ కెప్టెన్ నిగర్ సుల్తానా (Nigar Sultana) కీలక నిర్ణయం తీసుకుంది. భారత జట్టు చేతిలో 114 పరుగుల ఓటమిని తట్టుకోలేని టీ20 ఆమె కెప్టెన్సీ వదులుకుంది. మ్యాచ్ తర్వాత బాధను దిగమింగుతూ ఈ విషయాన్ని తను మీడియాతో వెల్లడించింది. బ్యాటింగ్ మీద దృష్టి సారించడం కోసమే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్టు సుల్తానా తెలిపింది. అయితే.. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు నుంచి తనకు సరైన సహకారం లభించకపోవడంతోనే ఆమె స్వచ్ఛందంగా వైదొలగాలని భావించినట్టు సమాచారం. బంగ్లాదేశ్ మహిళల జట్టుకు మరో షాక్. ఇటీవలే ఆసియా కప్‌లో, ఆదివారం ఆసియా క్రీడల్లో భారత జట్టు చేతిలో కంగుతిన్నందున నిగర్ సుల్తానా స్వచ్ఛందంగా కెప్టెన్సీ నుంచి వైదొలగింది. బోర్డు నుంచి సరైన సహకారం అందకపోవడంతోనే ఆమె ఈ నిర్ణయం తీసుకుందని టాక్. కానీ, తను మాత్రం బ్యాటింగ్ మీద దృష్టి సారించాలని కెప్టెన్సీ వద్దనుకున్నట్టు మీడియాతో చెప్పింది. ‘నేను బాధపడి కెప్టెన్సీ వదులుకున్నాని అనడం నిజం కాదు. బ్యాటర్‌గా, ప్లేయర్‌గా జట్టుకు, దేశానికి నేను చాలా చేయాలనుకుంటున్నా. అందుకని బ్యాటింగ్ మీద ఫోకస్ పెట్టాలనుకుంటున్నా. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా’ అని మీడియాతో పేర్కొంది సుల్తాన. టీమిండియా నిర్దేశించిన 196 పరుగుల భారీ ఛేదనలో 81కే కుప్పకూలడంపై స్పందించిన ఆమె.. భారత్‌ను తక్కువకే నిలువరించి ఉండాల్సిందని అభిప్రాయపడింది. ‘భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో మెరుగైన బౌలింగ్ దళం ధాటికి వికెట్లు కోల్పోవడం సహజమే. మేము భారత్‌ను తక్కువకే కట్టడి చేయాల్సింది. స్వల్ప స్కోర్‌కే జట్టు పరిమితమైనప్పుడు బ్యాటర్లం కచ్చితంగా బాధ్యత తీసుకోం. కానీ, టాపార్డర్‌లో ఒక్కరు చివరిదాకా నిలబడినా.. మేము మరికొన్ని రన్స్ చేసేవాళ్లం. అయితే.. ఇక్కడ సాధనకు అనువైన సౌకర్యాలు లేవు. చైనాతో మ్యా్చ్‌లో మా టీమ్‌ మంచి ప్రదర్శన చేసింది. కానీ, అవకాశాన్ని అందిపుచ్చుకోలేదు. మొత్తంగా జట్టుగా మేము చెత్త క్రికెట్ ఆడాం’ అని సుల్తాన తెలిపింది. భారత్ చేతిలో ఓడడంతో మూడో స్థానం కోసం పోరులో పాకిస్థాన్‌ను బంగ్లా ఢీకొట్టనుంది. పాక్‌పై తమకు మెరుగైన రికార్డు ఉండడం సానుకూల అంశమని పేర్కొన్న సుల్తాన చివరిసారిగా ఈ మ్యాచ్‌లో టీ20ల్లో బంగ్లాకు కెప్టెన్సీ వహించనుంది. 2022లో పొట్టి ఫార్మాట్‌లో కెప్టెన్సీ చేపట్టిన సుల్తాన కాంస్య పోరు తర్వాత వికెట్‌కీపర్, బ్యాటర్‌గా మాత్రమే కొనసాగనుంది. ఇటీవలే ముగిసిన మహిళల ఆసియా కప్‌లో భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌తో షేక్ హ్యాండ్ నిరాకరించిన సుల్తానపై విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే

Original source: ntnews.com
Read more on Kaizer News