వైన్ షాపుల వద్ద అల్లర్లు, పంచాయతీల్లో జోక్యం చేసుకుంటే పీడీ యాక్ట్ తప్పదని స్పష్టం నందికొట్కూరు, ఆంధ్రప్రభ: నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ ఆదేశాల మేరకు నందికొట్కూరు పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా అర్బన్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని రౌడీషీటర్లు, నేర చరిత్ర కలిగిన వ్యక్తులకు అర్బన్ సీఐ అశోక్‌కుమార్ ఆధ్వర్యంలో ఆదివారం ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ అశోక్‌కుమార్ మాట్లాడుతూ.. పట్టణంలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రౌడీయిజాన్ని పూర్తిగా విడిచిపెట్టి సమాజంలో మంచి పౌరులుగా మెలగాలని సూచించారు. వైన్ షాపుల వద్ద గుమిగూడి మద్యం సేవించి అల్లర్లు సృష్టించడం, దౌర్జన్యాలకు పాల్పడటం, భూ తగాదాలు, ఇతర పంచాయతీల్లో జోక్యం చేసుకుని బెదిరింపులకు పాల్పడితే ఉపేక్షించేది లేదన్నారు. ప్రతి రౌడీషీటర్ ప్రస్తుతం ఏం పని చేస్తున్నాడు, జీవనోపాధి ఎలా సాగిస్తున్నాడనే వివరాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. సత్ప్రవర్తనతో జీవిస్తూ కుటుంబాన్ని పోషించుకోవాలని హితవు పలికారు. పోలీసుల హెచ్చరికలను పెడచెవిన పెట్టి తిరిగి నేరాలకు పాల్పడితే నిరంతరం నిఘా ఉంచుతామని తెలిపారు. అవసరమైతే పీడీ యాక్ట్, బైండోవర్ కేసులు నమోదు చేసి జైలుకు పంపడంతో పాటు రౌడీషీట్లను కొనసాగిస్తామని సీఐ అశోక్‌కుమార్ హెచ్చరించారు. కార్యక్రమంలో అర్బన్ పోలీస్‌స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు