Kaizer News

పథకాలను సద్వినియోగం చేసుకోవాలి..

పథకాలను సద్వినియోగం చేసుకోవాలి..

· State - Telangana · prabhanews.com

శ్రీ సత్యసాయి బ్యూరో, ఆంధ్రప్రభ : కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రధానమంత్రి జీవన్‌జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన వంటి సామాజిక భద్రతా పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కదిరి ఏడీసీసీ బ్యాంక్ మేనేజర్ వెంకటాచలం సూచించారు. కదిరి ఏడీసీసీ బ్యాంక్‌లో ప్రధానమంత్రి జీవన్‌జ్యోతి బీమా యోజన కింద మంజూరైన బీమా క్లెయిమ్‌కు సంబంధించిన రూ.2 లక్షల డమ్మీ చెక్కును నామినీ అరుణమ్మకు బ్యాంక్ మేనేజర్ వెంకటాచలం అందజేశారు. కదిరి ప్రాంతానికి చెందిన రామచంద్ర కూలి పని చేసుకుంటూ జీవనం సాగించేవారు. అనారోగ్య కారణాలతో ఆయన మృతి చెందారు. ఏడీసీసీ బ్యాంక్ ఖాతాదారుడైన రామచంద్ర ప్రధానమంత్రి జీవన్‌జ్యోతి బీమా యోజనకు సంబంధించిన ప్రీమియాన్ని క్రమం తప్పకుండా చెల్లించారు. రామచంద్ర మృతి అనంతరం నామినీ అరుణమ్మ ఈ విషయాన్ని బ్యాంకు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. దీంతో బ్యాంకు సిబ్బంది వెంటనే స్పందించి అవసరమైన ప్రక్రియను పూర్తి చేశారు. నామినీకి బీమా క్లెయిమ్ మొత్తం రూ.2 లక్షలు అందేలా బ్యాంకు అధికారులు చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా అరుణమ్మ మాట్లాడుతూ తనకు బీమా క్లెయిమ్ మొత్తం అందేందుకు సహకరించిన ఏడీసీసీ బ్యాంక్ చైర్మన్ కేశవరెడ్డి, బ్యాంక్ మేనేజర్ వెంకటాచలం, బ్యాంక్ సిబ్బంది, ఆర్థిక అక్షరాస్యత కౌన్సిలర్ వీర మారుతికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ప్రధానమంత్రి బీమా పథకాలు సామాన్య, పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తాయని వెంకటాచలం తెలిపారు. అర్హులైన బ్యాంకు ఖాతాదారులు ఈ పథకాలలో చేరి వాటి ప్రయోజనాలను పొందాలని కోరారు. సామాజిక భద్రతా పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు బ్యాంకు తరఫున అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తలుపుల పీఏసీఎస్‌ పీఐసీ ఓబులరెడ్డి, ఫీల్డ్ ఆఫీసర్ వీరేష్, బ్యాంక్ సిబ్బంది హరికీర్తన, విమలావతి, గీతాంజలి, ఆర్థిక అక్షరాస్యత కౌన్సిలర్ వీర మారుతి, అనంతపురం జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ లిమిటెడ్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు

Original source: prabhanews.com
Read more on Kaizer News