ఇబ్రహీంపట్నంలో తనిఖీలు యూనివర్సిటీలు, ఇంజినీరింగ్ కాలేజీల్లో రికార్డుల పరిశీలన ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ : రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పరిసర ప్రాంతాల్లో విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారుల సోదాలు కలకలం రేపుతున్నాయి. శనివారం ఉదయం నుంచి పలు విద్యాసంస్థల్లో అధికారులు తనిఖీలు చేపట్టినట్లు సమాచారం. ఇబ్రహీంపట్నంలోని గురునానక్ యూనివర్సిటీలో విజిలెన్స్ బృందాలు తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. అత్యంత రహస్యంగా కొనసాగుతున్న ఈ సోదాల్లో విద్యార్థుల వాస్తవ హాజరు సంఖ్య, కళాశాల రికార్డులు, అడ్మిషన్ల వివరాలు, స్కాలర్‌షిప్‌లకు సంబంధించిన డేటాను అధికారులు పరిశీలిస్తున్నట్లు సమాచారం. అదే విధంగా ఇబ్రహీంపట్నం పరిసర ప్రాంతాల్లోని సీవీఆర్, శ్రీ ఇందు ఇంజినీరింగ్ కళాశాలల్లోనూ విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేపట్టినట్లు తెలిసింది. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా కళాశాలల్లో రికార్డులు నిర్వహిస్తున్నారా? ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌ల వివరాలు, ప్రవేశాల నమోదులో ఏమైనా వ్యత్యాసాలు ఉన్నాయా? అనే అంశాలపై అధికారులు ఆరా తీస్తున్నట్లు సమాచారం. అయితే ఈ సోదాలకు సంబంధించిన పూర్తి వివరాలను విజిలెన్స్ అధికారులు అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. తనిఖీలు పూర్తయిన తర్వాత అధికారులు పరిశీలించిన అంశాలు, నివేదికపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది