మ న స్మార్ట్‌ఫోన్‌లు లేదా ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు పాడైపోతే చెత్తకుప్పల్లో ప్లాస్టిక్ వ్యర్థాలుగా మిగిలిపోతాయి కదా. అలా కాకుండా ప్లాస్టిక్ స్థానంలో రాలిపోయిన ఆకుల ఈనెలను సర్క్యూట్ బోర్డులుగా వాడుకుని సర్క్యూట్‌లను తయారుచేసే కొత్త సైన్స్ మ్యాజిక్కే లీఫ్ట్రానిక్స్. అన్‌బి‘లీఫ’బుల్ అనిపిస్తోందా! వాడేశాక, లేదా కాలం తీరిపోయాక ఈ లీఫ్ట్రానిక్ గ్యాడ్జెట్స్‌ని చెత్తలో పడేసినా, ప్లాస్టిక్‌లా అవి పర్యావరణాన్ని పాడుచేయకుండా మట్టిలో సహజంగానే కుళ్లిపోయి, ఎరువుగా మారిపోతాయి. అంటే, రాబోయే తరాల వారి కోసం ఒక ఆకుపచ్చని భవిష్యత్తు ఎదురు చూస్తోందన్నట్లే! ఎలక్ట్రానిక్స్ రంగంలో ఇదొక కొత్త, ప్రకృతి హితమైన సాంకేతికత. సాధారణంగా మనం వాడే ఎలక్ట్రానిక్ వస్తువుల సర్క్యూట్ బోర్డులు, ప్లాస్టిక్ మెటీరియళ్లు పర్యావరణానికి చాలా హాని చేస్తాయి. అవి త్వరగా భూమిలో కలిసిపోవు. దీనికి పరిష్కారంగా జర్మనీ శాస్త్రవేత్తలు ఇప్పుడు ఆకుల సహాయంతో ఎలక్ట్రానిక్స్‌ను కనిపెట్టే ప్రయోగాల్లో తలమునకలై ఉన్నారు. ఈ టెక్నాలజీనే ‘లీఫ్ట్రానిక్స్’ అంటున్నారు. ఆకులలో ఉండే ‘ఈనెల’ నెట్‌వర్క్ నిర్మాణం చాలా గట్టిగా, ప్లాస్టిక్ లాంటి మన్నికను కలిగి ఉంటుంది. శాస్త్రవేత్తలు ఆకులలోని మెత్తని భాగాన్ని తొలగించి, ఆ ఈనెల అస్థిపంజరం లాంటి నిర్మాణాన్ని ప్లాస్టిక్ లేదా గాజుకు బదులుగా ఎలక్ట్రానిక్స్ సర్క్యూట్స్ తయారు చేయడానికి వాడేందుకు పరిశోధనలు జరుపుతున్నారు. ఈ టెక్నాలజీతో తయారైన ఎలక్ట్రానిక్ పరికరాలు భూమిలో సులభంగా కలిసిపోతాయి. దీనివల్ల ఎలక్ట్రానిక్ వ్యర్థాలు (ఇ–వేస్ట్) చాలా వరకు తగ్గుతాయి. రెండేళ్ల క్రితమే దాదాపుగా విజయం జర్మనీలోని ప్రఖ్యాత ‘డ్రెస్డెన్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ’ శాస్త్రవేత్తలు 2024 నవంబరులో ఈ టెక్నాలజీని ఒక కొలిక్కి తెచ్చారు. ఈ పరిశోధన బృందానికి ప్రొఫెసర్ కార్ల్ లియో, భారత సంతతికి చెందిన శాస్త్రవేత్త రాకేష్ ఆర్. నాయర్ నేతృత్వం వహించారు. లీఫ్ట్రానిక్స్‌పై వారి కృషికి సంబంధించిన పరిశోధన వివరాలు ప్రసిద్ధ సైన్స్ జర్నల్ ‘సైన్స్ అడ్వాన్సెస్’ లో ప్రచురితమయ్యాయి. భూమిపై నానాటికీ వేగంగా పెరిగిపోతున్న ఎలక్ట్రానిక్ వ్యర్థాలకు అడ్డుకట్ట వేయాలనే ఉద్దేశంతో ఈ బృందం రీసెర్చ్ ప్రారంభమైంది. పరిశోధనలో భాగంగా శాస్త్రవేత్తలు మొదట మగ్నోలియా చెట్ల ఆకులను తీసుకుని, అందులోని మెత్తని కణాలను పూర్తిగా తొలగించారు. కేవలం బలమైన ఈనెల అస్థిపంజరం మాత్రమే మిగిలేలా చేశారు. ఆ అస్థిపంజరం ‘లిగ్నోసెల్యులోజ్’ అనే పదార్థంతో కూడి ఉంటుంది. ప్రకృతి సిద్ధమైన ఆ ఈనెల నిర్మాణానికి పాలిమర్ కోటింగ్ ఇచ్చారు. ఎలాగంటే, ఈనెను ‘ఇథైల్ సెల్యులోజ్’ అనే ప్లాస్టిక్ లాంటి గట్టి, పర్యావరణ హితమైన (భూమిలో కలిసిపోయే) ద్రవ పదార్థంలో ముంచటం ద్వారా! సాధారణంగా పర్యావరణానికి హాని చేయని పదార్థాలు త్వరగా వేడికి కరిగిపోతాయి. కానీ, ఈ ఆకు ఈనెలల ఆధార (బేస్) నిర్మాణం వల్ల ఆ ‘ఇథైల్ సెల్యులోజ్’ పదార్థానికి ఎక్కువ ఉష్ణోగ్రతలను తట్టుకునే దృఢమైన బలం చేకూరింది! దీనిపై లేజర్ కటింగ్ ద్వారా సర్క్యూట్లు ప్రింట్ చేసి, ఎలక్ట్రానిక్ విడిభాగాలను అమర్చారు. ఈ