Markapuram: మార్కాపురం జిల్లా నుంచి వెలుగొండ ప్రాజెక్టుపై గుడ్ న్యూస్. మూడు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న వెలుగొండ ప్రాజెక్టు ట్రయల్ రన్ ప్రారంభమైంది. శ్రీశైలం వద్ద కొల్లం వాగు నుంచి నీటిని విడుదల చేసేందుకు ఇరిగేషన్ అధికారులు గేట్లు ఎత్తారు. గేట్లు ఎత్తడంతో కృష్ణమ్మ జలాలు బీరబీరా పరుగులు తీస్తూ జంట సొరంగాల్లోకి ప్రవేశించాయి. సొరంగ మార్గంలో ప్రయాణించిన కృష్ణమ్మ జలాలు గంటవానిపల్లి వద్ద ఫీడర్ కెనాల్‌కు చేరుకున్నాయి. దీంతో వెలుగొండ ప్రాజెక్టు ట్రయల్ రన్ విజయవంతంగా కొనసాగుతోంది. మూడు దశాబ్దాల కల నెరవేరిందంటూ వెలుగొండ ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ కె. రమేష్ హర్షం వ్యక్తం చేశారు. సిబ్బంది, సాంకేతిక నిపుణులు క్రమశిక్షణ, పట్టుదలతో పనిచేయడంతోనే ఈ విజయం సాధ్యమైందని తెలిపారు. మరోవైపు మార్కాపురం మాజీ జెడ్పీటీసీ సభ్యుడు కందుల రామిరెడ్డి మాట్లాడుతూ కరువు ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చూపిన చొరవ ఎంతో గొప్పదని కొనియాడారు. కృష్ణమ్మ జలాలు ఫీడర్ కెనాల్‌కు చేరుకోవడంతో వెలుగొండ పరిధిలోని రైతులు, ప్రజల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. మూడు దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ కరువు నేలకు కృష్ణమ్మ జలాలు చేరుతున్నాయి... ఇది వెలుగొండ ప్రాజెక్టు చరిత్రలో ఒక కీలక ఘట్టంగా నిలిచిపోనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృష్ణమ్మకు జల హారతి ఇచ్చి రేపు జాతికి అంకితం చేయనున్నారు