నర్సాపురం రచయిత డా. మట్టా సుగుణరావుకు ప్రతిష్ఠాత్మక గిడుగు తెలుగు భాషా పురస్కారం నర్సాపురం, ఆంధ్రప్రభ: తీర ప్రాంత సాహితీ వైభవానికి మరో అరుదైన గుర్తింపు లభించింది. నర్సాపురానికి చెందిన ప్రముఖ రచయిత డా. మట్టా సుగుణరావుకు ప్రతిష్ఠాత్మక గిడుగు తెలుగు భాషా పురస్కారం–2026 దక్కింది. తెలుగు భాషా, సాహిత్య రంగానికి ఆయన అందిస్తున్న విశిష్ట సేవలను గుర్తిస్తూ ఈ పురస్కారానికి ఎంపిక చేయడంతో నర్సాపురం సాహితీ వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది. తెలుగు భాషా దినోత్సవం, తెలుగు భాషోద్యమ పితామహుడు గిడుగు రామమూర్తి పంతులు జయంతిని పురస్కరించుకుని శనివారం తాడేపల్లిలోని శ్రీ ఫార్ట్యూన్ గ్రాండ్‌లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తెలుగు, సంస్కృత అకాడమీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో డా. మట్టా సుగుణరావుకు పురస్కారాన్ని అందజేశారు. తెలుగు భాష, సాహిత్యం, సామాజిక రంగాల్లో విశిష్ట సేవలు అందిస్తున్న ప్రముఖులను గుర్తించేందుకు ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ సిఫారసుల మేరకు ‘సాహిత్య రచనలు’ విభాగంలో డా. సుగుణరావును పురస్కార గ్రహీతగా ఎంపిక చేశారు. డా. మట్టా సుగుణరావు సాహితీ ప్రస్థానం ఎంతో విస్తృతమైనది. ఇప్పటివరకు ఆయన 350కి పైగా కథలు రచించారు. వాటిలో 150కి పైగా కథలు వివిధ పోటీల్లో పురస్కారాలు అందుకోవడం విశేషం. సామాజిక వాస్తవాలు, మానవ సంబంధాలు, జీవితంలోని విభిన్న కోణాలను తనదైన శైలిలో ఆవిష్కరిస్తూ ఆయన రచనలు పాఠకులను ఆకట్టుకున్నాయి. డా. సుగుణరావు తొమ్మిది నవలలు రచించారు. ‘మరుగేలరా’, ‘ఏడుగుర్రాల సూర్యుడు’, ‘పాంచజన్యం’, ‘నిజం’, ‘ఫైనల్ డయాగ్నోసిస్’, ‘అలీబాబా ఐదుగురు స్నేహితులు’, ‘త్రివేణి’, ‘విశ్వశాంతి నికేతన్’, ‘రామ్ సన్నాఫ్ సత్యం’ వంటి రచనలు ఆయన సాహితీ ప్రస్థానంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టాయి. ‘ఫైనల్ డయాగ్నోసిస్’ నవలకు అన్వీక్షికి సంస్థ పురస్కారం లభించగా, ‘అలీబాబా ఐదుగురు స్నేహితులు’ నవలకు తానా బాలల పురస్కారం దక్కింది. ‘జాబిలి మీద సంతకం’, ‘నేలకు దిగిన నక్షత్రం’, ‘సుగుణ కథాభిరామం’, ‘ఆకాశంలో ఒక నక్షత్రం’, ‘పునరుత్థానం–దళిత కథలు’ పేరుతో ఆయన కథా సంపుటాలు వెలువడ్డాయి. కథలు, నవలలకే పరిమితం కాకుండా నాటక రచనలోనూ ఆయన తనదైన ముద్ర వేశారు. ‘ఆకాశంలో ఒక నక్షత్రం’ ఆంగ్ల నాటకానికి టాటా లిట్ ఫెస్ట్ నుంచి లక్ష రూపాయల బహుమతి లభించింది. అదే రచన తెలుగు రూపానికి విశాఖపట్నం తెలుగు నాటక సమితి ప్రథమ బహుమతి అందించడం విశేషం. డా. సుగుణరావు రచనలు పాఠకులకే కాకుండా పరిశోధకులకు కూడా ఆసక్తికర అంశాలుగా మారాయి. ఆయన కథలపై ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీ పరిశోధన జరిగింది. ఆయన సాహిత్యంపై మరో పీహెచ్‌డీతో పాటు రెండు ఎంఫిల్ పరిశోధనలు జరగడం ఆయన రచనల ప్రాధాన్యాన్ని తెలియజేస్తోంది. సాహిత్య రంగంలో ఆయన చేసిన సేవలకు ఇప్పటికే బలివాడ కాంతారావు జీవన సాఫల్య పురస్కారం, దండెంరాజు ఫౌండేషన్ ‘కథామయుడు’ పురస్కారం, తటవర్తి భారతి పురస్కారం, సుమతి సాహితీ సామ్రాట్ పురస్కారం వంటి అనేక గౌరవాలు దక్కాయి. తాజాగా గిడుగు తెలుగు భాషా పురస్కారం ఈ పురస్కారాల జాబితాలో చేరింది. డా. మట్టా సుగుణరావుకు ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారం లభించడం నర్సాపుర