నిమజ్జన స్థలాన్ని పరిశీలించిన మంచిర్యాల డీసీపీ భాస్కర్ దండేపల్లి, ఆంధ్రప్రభ : గణేష్ నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా గణేష్ విగ్రహాల నిమజ్జనానికి దండేపల్లి మండలం గూడెం గోదావరి నది వద్ద ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో నిమజ్జనం నిర్వహించే ప్రదేశాన్ని మంచిర్యాల డీసీపీ భాస్కర్ శుక్రవారం పరిశీలించారు. నిమజ్జన కార్యక్రమానికి భక్తులు, గణేష్ మండపాల నిర్వాహకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉండడంతో భద్రతా ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. గోదావరి నది వద్ద నిమజ్జన సమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని డీసీపీ సూచించారు. నది పరిసరాల్లో భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని, నిమజ్జన ప్రదేశంలో రద్దీని నియంత్రించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గణేష్ విగ్రహాలతో వచ్చే వాహనాల రాకపోకలకు అంతరాయం కలగకుండా ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టాలని సూచించారు. నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా నిర్వహించేందుకు పోలీసు, రెవెన్యూ, పంచాయతీ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని డీసీపీ పేర్కొన్నారు. నిమజ్జనానికి వచ్చే భక్తులు పోలీసు శాఖ సూచనలను పాటిస్తూ సహకరించాలని కోరారు. నిమజ్జన స్థలంలో చేపట్టాల్సిన ఏర్పాట్లను పరిశీలించి, భక్తుల సౌకర్యం, భద్రతకు సంబంధించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ పరిశీలనలో లక్షెట్టిపేట సీఐ రమణమూర్తి, దండేపల్లి ఎంపీడీవో జేఆర్ ప్రసాద్, ఎస్సై గుండేటి రాజవర్ధన్, ఆర్‌ఐ భూమన్న, పంచాయతీ కార్యదర్శి నాగరాజు తదితరులు పాల్గొన్నారు