తుని, ఆగస్ట్ 30: తుని టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసుల ఆధ్వర్యంలో ఈరోజు డ్రగ్స్‌కు వ్యతిరేకంగా భారీ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. శ్రీ జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు మరియు పెద్దాపురం SDPO తిలక్ పర్యవేక్షణలో ఉదయం కొండ వారి పేట, అమ్మాజీ పేట, సీతారాంపురం మరియు నెహ్రూ నగర్ ప్రాంతాలలో ఈ అవగాహన కార్యక్రమం సాగింది. తుని టౌన్ CI ఎం. గీతా రామకృష్ణ నేతృత్వంలో జరిగిన ఈ ర్యాలీలో భాగంగా పోలీసులు పలు కీలక చర్యలు చేపట్టారు. అనుమానాస్పద ప్రాంతాలలో తిరుగుతూ గంజాయి సేవిస్తున్న వారి కోసం మరియు విక్రయించే వారి ఆచూకీ కోసం సమాచారాన్ని సేకరించారు. శాంతిభద్రతల పరిరక్షణపై స్థానిక ప్రజలకు అవగాహన కల్పించారు. మాదకద్రవ్యాల దుష్ప్రభావాలు, యువతపై వాటి తీవ్ర ప్రభావం మరియు వాటికి దూరంగా ఉండాల్సిన అవసరం గురించి ప్రజలకు వివరించారు. సమాజం నుండి మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా సహకరించాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు