Kaizer News

Anakapalli: అనుమానాస్పద కార్యకలాపాలపై పోలీసులకు సమ

Anakapalli: అనుమానాస్పద కార్యకలాపాలపై పోలీసులకు సమాచారం ఇవ్వాలి!

· State - Telangana · hmtvlive.com

Shorts Anakapalli: జిల్లాలో అనుమతి లేకుండా బాణాసంచా తయారీ, నిల్వ, విక్రయాలు చేపట్టే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ హెచ్చరించారు. గతంలో చోటుచేసుకున్న బాణాసంచా ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని ప్రజల ప్రాణ, ఆస్తుల రక్షణకు జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో బాణాసంచా తయారీ కేంద్రాలపై అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని ఎస్పీ ఆదేశించారు. అనుమతి పొందిన తయారీ కేంద్రాల్లో అగ్నిమాపక పరికరాలు, నీరు, ఇసుక తదితర భద్రతా ఏర్పాట్లు నిబంధనల ప్రకారం ఉన్నాయా లేదా పరిశీలించాలని సూచించారు. అనుమతి లేని బాణాసంచా తయారీ, నిల్వ కేంద్రాలపై ప్రత్యేకంగా దృష్టి సారించి, ఎక్కడైనా అక్రమ కార్యకలాపాలు గుర్తిస్తే తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు. నిబంధనలకు విరుద్ధంగా బాణాసంచా తయారు చేసే వారితో పాటు అక్రమంగా నిల్వ చేసి విక్రయించే వారిపైనా చర్యలు తప్పవని స్పష్టం చేశారు. అనుమతి పొందిన ప్రదేశాల్లో, నిర్ణీత పరిమితులకు లోబడి మాత్రమే బాణాసంచా తయారీ, నిల్వ చేపట్టాలని తయారీదారులు, వ్యాపారులకు ఎస్పీ సూచించారు. మైనర్లు, నైపుణ్యం లేని వ్యక్తులను పనిలో నియమించడం నేరమని, శిక్షణ, అనుభవం ఉన్న వారితోనే పనులు చేయించాలని పేర్కొన్నారు. నివాస ప్రాంతాలు, జనసమ్మర్థం ఉన్న ప్రదేశాల్లో బాణాసంచా తయారీ లేదా భారీగా నిల్వ చేయడం పూర్తిగా నిషేధమని తెలిపారు. తయారీ కేంద్రాల్లో విద్యుత్ వైరింగ్ సురక్షితంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, ధూమపానం, ఇతర మండే పదార్థాలకు అనుమతి ఇవ్వకూడదని సూచించారు. తమ పరిసర ప్రాంతాల్లో అనుమతి లేకుండా బాణాసంచా తయారు చేస్తున్నా, అక్రమంగా నిల్వ ఉంచినా, నిబంధనలకు విరుద్ధంగా విక్రయిస్తున్నా వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని ఎస్పీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. డయల్ 112కు ఫోన్ చేసి కూడా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. సమాచారం అందించే వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని పేర్కొన్నారు. ప్రజలందరూ పోలీసు శాఖకు సహకరించి బాణాసంచా ప్రమాదాల నివారణకు తోడ్పడాలని ఎస్పీ తుహిన్ సిన్హా కోరారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News