Kaizer News

నీట్ పీజీలో ఆలిండియా కోటా 15 శాతానికి కుదించండి...

నీట్ పీజీలో ఆలిండియా కోటా 15 శాతానికి కుదించండి...కేంద్ర మంత్రికి మాజీ ఎంపీ వినోద్ లేఖ

· Entertainment · v6velugu.com

హైదరాబాద్, వెలుగు: నీట్ పీజీ మెడికల్ అడ్మిషన్లలో ప్రస్తుతం ఉన్న 50 శాతం ఆలిండియా కోటాను 15 శాతానికి తగ్గించాలని కేంద్రాన్ని మాజీ ఎంపీ, బీఆర్ఎస్ నేత బోయినపల్లి వినోద్ కుమార్ కోరారు. నీట్ యూజీ ప్రవేశాల్లో ఏఐక్యూ 15 శాతంగా ఉండగా, పీజీ స్థాయిలో మాత్రం ఏకంగా 50 శాతం ఉండడం తీవ్ర అసమానతకు దారితీస్తోందన్నారు. తెలంగాణ విద్యార్థుల న్యాయబద్ధమైన ప్రయోజనాలను కాపాడేందుకు పీజీ కోటాను కూడా 15 శాతానికి కుదించాలని కోరుతూ ఆయన ఆదివారం కేంద్ర మంత్రి జేపీ నడ్డాకు లేఖ రాశారు. జాతీయ స్థాయిలో విద్యార్థుల మొబిలిటీని తాము వ్యతిరేకించడం లేదని.. కానీ, పీజీ స్థాయిలో సీట్లు చాలా పరిమితంగా, అత్యంత ప్రత్యేకమైనవిగా ఉంటాయని గుర్తుచేశారు. అటువంటి సీట్లలో సగం సీట్లను జాతీయ కోటాకు కేటాయించడం వల్ల రాష్ట్రాల వైద్య అవసరాలు దెబ్బతింటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత గత దశాబ్ద కాలంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సొమ్ముతో ప్రతి జిల్లాలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసిందని వినోద్ కుమార్ వివరించారు. భూములు, భవనాలు, బోధనాసుపత్రులు, ల్యాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, ఫ్యాకల్టీ కోసం భారీగా ప్రజాధనాన్ని వెచ్చించి ఎంబీబీఎస్, పీజీ సీట్లను విస్తరించినట్టు తెలిపారు. స్థానిక గ్రామీణ, పట్టణ ప్రాంత ప్రజల వైద్య అవసరాలు తీర్చేందుకే ఈ కాలేజీలను ఏర్పాటు చేశామని, పీజీ సీట్లలో 50 శాతం జాతీయ కోటాకు వెళ్లడం వల్ల స్థానిక వైద్య విద్యార్థులతోపాటు రాష్ట్ర వైద్య ఆరోగ్య రంగానికి నష్టం వాటిల్లుతోందన్నారు. భారీ పెట్టుబడులు పెట్టిన రాష్ట్రాలకు పీజీ సీట్లలో ఎక్కువ వాటా దక్కేలా ఫెడరల్ స్ఫూర్తితో నిబంధనలు మార్చాలని కోరారు

Original source: v6velugu.com
Read more on Kaizer News