Kaizer News

Eluru: పోలవరం నిర్వాసితుల పరిహారం పేరుతో అక్రమ వసూ

Eluru: పోలవరం నిర్వాసితుల పరిహారం పేరుతో అక్రమ వసూళ్ల దందా!

· State - Telangana · hmtvlive.com

Shorts Eluru: పోలవరం ముంపు గ్రామాల నిర్వాసితులకు ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీలు, పరిహారం, ధ్రువీకరణ పత్రాలు ఇప్పిస్తామంటూ కొందరు వ్యక్తులు అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆర్‌అండ్‌ఆర్‌ జాబితా నుంచి తొలగించిన పేర్లను తిరిగి చేర్పిస్తామని, డెత్‌, ఫ్యామిలీ మెంబర్‌ సర్టిఫికెట్లు ఇప్పిస్తామని చెప్పి రూ.15 వేల నుంచి రూ.40 వేల వరకు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇక ఇతర ప్రాంతాల్లో స్థిరపడిన వారికి ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ ఇప్పిస్తామని, పరిహారం వచ్చిన తర్వాత రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షలు ఇవ్వాలంటూ ఒప్పందాలు చేసుకుంటున్నారని, ముందస్తుగా రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం. కాంటూర్‌ లెవెల్‌, కొత్త ఇళ్లకు పరిహారం, మిగులు భూములకు భూ పరిహారం ఇప్పిస్తామని కూడా డబ్బులు అడుగుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అదేవిధంగా ఎటపాక మండల గిరిజనులకు భూములు కేటాయించేందుకు కుక్కునూరు మండలంలో జరుగుతున్న భూసేకరణలో ఎకరాకు రూ.15 లక్షల పరిహారం ఇప్పిస్తామని రైతులకు హామీ ఇస్తూ, పరిహారం వచ్చిన తర్వాత రూ.1.50 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు ఇవ్వాలని కోరుతున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంలో జంగారెడ్డిగూడెం, కుక్కునూరు ప్రాంతాలకు చెందిన ఇద్దరు వ్యక్తులు మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మండల కార్యాలయాల చుట్టూ తిరిగే నిర్వాసితులను లక్ష్యంగా చేసుకుని ఈ వ్యవహారం సాగుతోందని పలువురు చెబుతున్నారు. ఆరోపణలపై జిల్లా అధికారులు సమగ్ర విచారణ చేపట్టి నిజానిజాలు తేల్చాలని, అక్రమాలకు పాల్పడినట్లు తేలితే చట్టపరమైన చర్యలు తీసుకుని దళారి వ్యవస్థకు అడ్డుకట్ట వేయాలని నిర్వాసితులు, రైతులు కోరుతున్నారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News