‘ఆత్మాయత్తౌ వృద్ధి వినాశౌ’ ప్రసిద్ధ సంస్కృత సూక్తి. వృద్ధి, వినాశనం అనేవి పూర్తిగా మన చేతుల్లోనే ఉంటాయి. ఈ రెండింటికీ మనకు మనమే బాధ్యులం. ఒక వ్యక్తి తన జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకోవాలన్నా లేదా పతనం కావాలన్నా దానికి ఆ వ్యక్తి తీసుకునే నిర్ణయాలు, చేసే పనులే కారణమని పెద్దలు చెప్తున్నారు. విజయం సాధించడానికి మన కష్టమే ముఖ్య పాత్ర పోషిస్తుంది. అలాగే తప్పుడు నిర్ణయాల వల్ల నాశనం కూడా మన వల్లే జరుగుతుంది. కాబట్టి మన భవిష్యత్తును మనమే మలచుకోగలం. ఈ విషయం ‘చాణక్య సూత్రాలు’ గ్రంథంలో వివరిస్తోంది. మహాభారతంలో అర్జునుడు పాశుపతాస్త్రాన్ని సాధించడానికి పరమశివునితో ఘోరయుద్ధం చేశాడు. అర్జునుడి పట్టుదల, నిజాయితీ చూసిన పర మశివుడు పాశుపతాస్త్రాన్ని ప్రసాదించి, ‘ఈ అస్త్రాన్ని మానవాళి మీద ప్రయోగించకూడదు’ అని చెప్పాడు. అందువల్లే అర్జునుడు కురుక్షేత్ర సమయంలో ఆ అస్త్రాన్ని ప్రయోగించలేదు. పరమశివుని ద్వారా పాశుపతాస్త్రాన్ని సాధించాడని తెలుసుకున్న దేవేంద్రుడు.. అనేక దివ్యాస్త్రాలను అర్జునునికి బహూకరించాడు. అన్ని అస్త్రాలను లోక కల్యాణం కోసం మాత్రమే ప్రయోగించి విజయుడయ్యాడు. ఇక కర్ణుడి విషయం చూస్తే – తన వినాశనానికి తానే కారకుడయ్యాడు. పరశురాముడి దగ్గర విద్యాభ్యాసం చేయడం కోసం అబద్ధం పలికాడు. దుర్యోధనుడిని ప్రీతి చేయడం కోసం మాత్రమే కొన్ని ఆయుధాలను, అస్త్రాలను సాధించుకున్నాడు. అంటే ప్రజాశ్రేయస్సు కోసం కాకుండా, అవినీతిపరుడైన దుర్యోధనుడి కోసమే తన అస్త్రాలను ఉపయోగించాడు. ఆ కారణంగానే కర్ణుడికి ఏ అస్త్రమూ పనిచేయలేదు. చివరకు అర్జునుని చేతిలో వీరస్వర్గం పొందాడు. ఏకలవ్యుడు సైతం గురుముఖతః కాకుండా తనకు తానుగా స్వయంగా నేర్చుకుని, ఏ దోషమూ లేని ఒక కుక్క మీద ప్రయోగించాడు. విద్యను దుర్వినియోగం చేయడం వల్ల ముప్పు వాటిల్లుతుందనే ఉద్దేశ్యంతో ద్రోణుడు ఏకలవ్యుని బొటన వ్రేలిని దక్షిణగా కోరాడు. భస్మాసురుడి విషయం పరిశీలిస్తే – భస్మాసురుడు పరమశివుని ధ్యానిస్తూ కఠోర తపస్సు చేశాడు. పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు. ‘భస్మాసురా! నీ తపస్సుకు మెచ్చాను. నువ్వు కోరిన వరం అనుగ్రహిస్తాను. కోరుకో’ అన్నాడు. ‘పరమశివా! నేను ఎవరి తల మీద చెయ్యి పెడితే, వారు బూడిదైపోవాలి’ అని కోరాడు భస్మాసురుడు. సరేనన్నాడు శివుడు. అంతే ఆ వరం పనిచేస్తోందో లేదో తెలుసుకోవడం కోసం తన చేతిని పరమశివుని శిరస్సు మీద ఉంచడానికి ముందుకు వచ్చాడు. భయంతో శివుడు పరుగులు తీశాడు. చివరకు విష్ణుమూర్తి జగన్మోహిని వేషంలో భస్మాసురుడికి నాట్యం నేర్పుతూ, తల మీద చేయి ఉంచుకుంది. భస్మాసురుడు కూడా అదే పని చేశాడు. తక్షణమే బూడిదైపోయాడు. తన పతనానికి తానే కారకుడయ్యాడు భస్మాసురుడు. ఒక ఊరిలో పరంధామయ్య అనే ఒక రైతు ఉన్నాడు. అతడికి రాజు, రాము అని ఇద్దరు కొడుకులు. ఒకనాడు పరంధామయ్య కొడుకులిద్దరినీ పిలిచి, ‘మీ ఇద్దరికీ వెయ్యి రూపాయల చొప్పున ఇస్తున్నాను. దీనితో మీరు వ్యాపారం ప్రారంభించి, ఒక సంవత్సరంలో మీ లాభనష్టాల గురించి నాకు తెలియచేయండి’ అని చెప్పాడు. పెద్ద కొడుకు రాజు వంద రూపాయలతో విత్తనాలు, వంద రూపాయలతో ఎరువులు కొన్నాడు. కొంత భాగంలో ఆకు కూరలు, కొంత భాగంలో కూరగాయ మొక్కలు పెంచడం ప్రారంభించా