Kaizer News

శ్రావణ పౌర్ణమి వేళ చౌడేశ్వరి అమ్మవారికి ప్రత్యేక అ

శ్రావణ పౌర్ణమి వేళ చౌడేశ్వరి అమ్మవారికి ప్రత్యేక అలంకరణ

· State - Telangana · prabhanews.com

చిన్నంబావి, ఆంధ్రప్రభ: నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలోని పెంట్లవెల్లి మండల కేంద్రంలో శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయంలో శ్రావణ పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని మహాలక్ష్మి రూపంలో ప్రత్యేకంగా అలంకరించారు. ధూప, దీప, నైవేద్యాలతో పూజలు నిర్వహించగా, తొగుట వీర క్షత్రియులు బోనం కుండలో నైవేద్యం సిద్ధం చేసి భజనలు, కోలాటాల నడుమ పురవీధుల గుండా ఊరేగింపుగా ఆలయానికి తీసుకువచ్చారు. అనంతరం భక్తుల కోరికలు తీర్చే కొంగుబంగారంగా భావించే చౌడేశ్వరి అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించారు. పూజా కార్యక్రమాల్లో పలువురు మహిళలు పూనకాలతో అమ్మవారి ఆశీస్సులు పొందగా, కుంకుమార్చన కార్యక్రమంలో మహిళా భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. పురుష భక్తులు కూడా పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్నారు. రాత్రి నిర్వహించిన పెద్ద మంగళహారతి కార్యక్రమం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేపట్టడంతో ఆలయ ప్రాంగణం భక్తజన సందడితో కళకళలాడింది

Original source: prabhanews.com
Read more on Kaizer News