న్యాయం చేయాలంటూ అత్తవారి ఇంటి ఎదుట మహిళ ఆందోళన మచిలీపట్నం, ఆంధ్రప్రభ : విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో వివాహం చేసుకున్న అనంతరం భర్త తనను వదిలి వెళ్లిపోయాడని ఆరోపిస్తూ ఓ మహిళ అత్తవారి ఇంటి ఎదుట ఆందోళనకు దిగింది. మచిలీపట్నానికి చెందిన జయలక్ష్మి, పెంకు ఫణికుమార్‌కు ఆగస్టు 30న విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో వివాహం జరిగినట్లు ఆమె తెలిపింది. వివాహానంతరం వారు మూడు స్తంభాల సెంటర్ సమీపంలోని అత్తవారి ఇంట్లో ఉన్నట్లు పేర్కొంది. రహస్య వివాహం విషయమై ఇంట్లో గొడవలు జరుగుతున్నాయనే కారణంతో ఫణికుమార్ శక్తి గుడి సమీపంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నాడని జయలక్ష్మి తెలిపింది. అనంతరం తనను ఇంట్లో ఒంటరిగా వదిలి వెళ్లిపోయాడని ఆరోపించింది. భర్త కోసం అత్తవారి ఇంటికి వెళ్లిన తనకు అవమానం ఎదురైందని వాపోయింది. తన భర్తను తనకు అప్పగించి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ జయలక్ష్మి అత్తవారి ఇంటి ఎదుట ఆందోళన చేపట్టింది. ఫణికుమార్ ఎక్కడికి వెళ్లాడో తమకు తెలియదని, అయితే ఫోన్‌లో మాత్రం అందుబాటులో ఉన్నాడని కుటుంబ సభ్యులు చెబుతున్నట్లు జయలక్ష్మి పేర్కొంది. ఘటనపై న్యాయం చేయాలని ఆమె కోరుతోంది