అమావాస్య, పున్నమి రోజుల్లోనే వస్తుందనడం మూఢనమ్మకమే.. క్రమం తప్పకుండా మందులు వాడితే అదుపులో ఉంచుకోవచ్చు కదిరి రూరల్, ఆంధ్రప్రభ : మూర్ఛ వ్యాధిపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించాల్సిన అవసరం ఉందని విజయవాడకు చెందిన ప్రముఖ నరాల వైద్యుడు డాక్టర్ గోపాలం శివనారాయణ అన్నారు. అమావాస్య, పున్నమి రోజుల్లోనే మూర్ఛ వస్తుందనే నమ్మకం పూర్తిగా మూఢనమ్మకమని స్పష్టం చేశారు. మూర్ఛకు శాస్త్రీయ కారణాలు ఉన్నాయని, వైద్యుల సూచనల మేరకు క్రమం తప్పకుండా మందులు వాడుతూ చికిత్స పొందితే వ్యాధిని నియంత్రించుకోవచ్చని తెలిపారు. కదిరి పట్టణంలోని స్థానిక ఎన్‌జీవో హోంలో ఆదివారం జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మూర్ఛ రోగుల కోసం రెగ్యులర్ వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ గోపాలం శివనారాయణ శిబిరానికి హాజరై మూర్ఛతో బాధపడుతున్న రోగులను పరీక్షించారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, మందుల వినియోగం, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు. సుమారు 60 మంది మూర్ఛ రోగులు శిబిరానికి హాజరై వైద్య పరీక్షలు చేయించుకున్నారు. మూర్ఛ అనేది దెయ్యాలు, పిశాచాలు పట్టడం వల్ల వచ్చేది కాదని, దీనికి వైద్యపరమైన కారణాలు ఉంటాయని డాక్టర్ శివనారాయణ వివరించారు. మెదడులోని నరాల పనితీరులో ఏర్పడే అసాధారణ విద్యుత్ చర్యల కారణంగా మూర్ఛ లక్షణాలు కనిపించవచ్చని పేర్కొన్నారు. మూర్ఛ వచ్చిన వ్యక్తిని భయపెట్టకుండా వెంటనే సరైన వైద్య సహాయం అందించడం ముఖ్యమన్నారు. రోగి పరిస్థితిని గమనిస్తూ ప్రమాదం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మూర్ఛ వచ్చిన సమయంలో రోగి నోట్లో వస్తువులు పెట్టడం, బలవంతంగా చేతులు, కాళ్లు పట్టుకోవడం వంటి చర్యలకు దూరంగా ఉండాలని తెలిపారు. రోగికి ఎలాంటి ప్రమాదం జరగకుండా చూసి, పరిస్థితి అదుపులోకి వచ్చే వరకు పక్కనే ఉండాలని సూచించారు. తరచూ మూర్ఛ వస్తున్న వారు స్వయంగా మందులు నిలిపివేయకుండా వైద్యుల సలహా మేరకు చికిత్స కొనసాగించాలని చెప్పారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే రోగులకు నిరంతర వైద్య సలహాలు అందేలా జన విజ్ఞాన వేదిక చేపడుతున్న కార్యక్రమం ఉపయోగకరంగా ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. మూర్ఛ వ్యాధిపై ప్రజల్లో అవగాహన పెంచడంతో పాటు అపోహలను తొలగించేందుకు ఇటువంటి వైద్య శిబిరాలను కొనసాగిస్తామని చెప్పారు. తదుపరి మూర్ఛ వైద్య శిబిరాన్ని జనవరి 17న నిర్వహించనున్నట్లు జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షుడు బి. నరసారెడ్డి తెలిపారు. శిబిరానికి హాజరయ్యే రోగులు ప్రస్తుతం ఉపయోగిస్తున్న మందులు, గతంలో చేయించుకున్న స్కానింగ్ నివేదికలు, ఇతర వైద్య రికార్డులను వెంట తీసుకురావాలని సూచించారు. వాటిని పరిశీలించడం ద్వారా వైద్యులు రోగి ఆరోగ్య పరిస్థితిపై మరింత స్పష్టమైన సలహాలు ఇవ్వగలరని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక ప్రతినిధులు ఎన్. మహేంద్రరెడ్డి, డాక్టర్ మహబూబ్ భాషా తదితరులు పాల్గొన్నారు