గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాలో కలుపుకోవాలన్న డొనాల్డ్ ట్రంప్ కోరిక పూర్తిగా నెరవేరలేదు. కానీ ఆర్కిటిక్ ప్రాంతంలోని ఈ వ్యూహాత్మక ద్వీపంపై అమెరికా సైనిక పట్టు మాత్రం మరింత బలపడేలా కొత్త ఒప్పందం కుదిరింది. అమెరికా, డెన్మార్క్, గ్రీన్‌ల్యాండ్ మధ్య కుదిరిన ఈ ఒప్పందం ద్వారా గ్రీన్‌ల్యాండ్‌లో అమెరికా తన సైనిక ఉనికిని భారీగా విస్తరించుకునే అవకాశం లభించింది. అదే సమయంలో అమెరికా ప్రత్యర్థి దేశాలు అక్కడ సైనిక స్థావరాలు ఏర్పాటు చేయకుండా అడ్డుకట్ట పడనుంది. అందుకే ఈ ఒప్పందాన్ని ట్రంప్ సాధారణ డిఫెన్స్ డీల్‌గా చూడటం లేదు. తన సోషల్ మీడియా వేదిక ‘ట్రూత్ సోషల్’లో శుక్రవారం స్పందించిన ఆయన.. ఈ ఒప్పందాన్ని “అమెరికాకు కల నిజమైనట్టే” అభివర్ణించారు. గ్రీన్‌ల్యాండ్‌ను సురక్షితంగా ఉంచేందుకు అమెరికాకు అవసరమైన చర్యలు తీసుకునే సామర్థ్యం ఎప్పటికీ ఉంటుందని ట్రంప్ పేర్కొన్నారు. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. గ్రీన్‌ల్యాండ్ అమెరికా భూభాగంగా మారడం లేదు. కొత్త ఒప్పందం ప్రకారం గ్రీన్‌ల్యాండ్‌లో అమెరికా తన సైనిక కార్యకలాపాలను గణనీయంగా పెంచుకునే అవకాశం ఉంటుంది. అదే సమయంలో అమెరికా ప్రత్యర్థిగా భావించే దేశాలకు అక్కడ సైనిక స్థావరాలు ఏర్పాటు చేసే అవకాశం ఉండదు. నాటోకు వెలుపల ఉన్న దేశాలు గ్రీన్‌ల్యాండ్‌లో సైనిక స్థావరాలు ఏర్పాటు చేయకుండా ఒప్పందం నిరోధిస్తుంది. అంతేకాదు.. అమెరికా, దాని మిత్రదేశాలకు మాత్రమే కొన్ని కీలకమైన, సున్నితమైన పెట్టుబడులు పెట్టేందుకు అనుమతి ఉంటుందని అమెరికా అధికారులు వెల్లడించారు. గ్రీన్‌ల్యాండ్‌లోని స్థావరాలను ఉపయోగించడం, అక్కడికి చేరుకోవడం, గగనతలాన్ని వినియోగించడం వంటి హక్కులు అమెరికాకు కొనసాగుతాయని తెలిపారు. ఇది పూర్తిగా కొత్త వ్యవస్థ కాదు. 1951లో కుదిరిన ఒప్పందం ద్వారా కూడా అమెరికాకు గ్రీన్‌ల్యాండ్‌లో విమాన రాకపోకలు, సైనిక స్థావరాల వినియోగానికి విస్తృత హక్కులు ఉన్నాయి. ఇప్పుడు ఆ హక్కులను మరింత బలోపేతం చేసే దిశగా తాజా ఒప్పందం కనిపిస్తోంది. ఆర్కిటిక్ ప్రాంతంలో గ్రీన్‌ల్యాండ్ భౌగోళికంగా అత్యంత వ్యూహాత్మక ప్రదేశంలో ఉంది. ఉత్తర అమెరికా, యూరప్ మధ్య ఉండటంతో అమెరికా రక్షణ వ్యవస్థకు ఇది కీలకంగా మారింది. రష్యా, చైనా వంటి దేశాలు ఆర్కిటిక్ ప్రాంతంలో తమ ప్రభావాన్ని పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో గ్రీన్‌ల్యాండ్‌పై నియంత్రణ, సైనిక ప్రాప్యత అమెరికాకు ప్రాధాన్యం సంతరించుకుంది. గ్రీన్‌ల్యాండ్ వాయువ్య ప్రాంతంలో అమెరికా స్పేస్ ఫోర్స్‌కు ఇప్పటికే ఒక స్థావరం ఉంది. కొత్త ఒప్పందం నేపథ్యంలో అక్కడ మరిన్ని సైనిక మౌలిక సదుపాయాలు ఏర్పడతాయా? కొత్త స్థావరాలు వస్తాయా? అనే ప్రశ్నలు ఇప్పుడు ముందుకొస్తున్నాయి. అయితే దీనిపై ఇప్పటివరకు స్పష్టమైన వివరాలు వెలువడలేదు. డెన్మార్క్ ప్రభుత్వం ఈ ఒప్పందాన్ని ఉత్తర అట్లాంటిక్, ఆర్కిటిక్ ప్రాంత భద్రతకు ఉపయోగపడే చర్యగా అభివర్ణించింది. గ్రీన్‌ల్యాండ్ ప్రధాని జెన్స్-ఫ్రెడరిక్ నీల్సన్ కూడా ఈ ఒప్పందం తమ ప్రయోజనాలను, అంతర్జాతీయ పాత్రను గౌరవిస్తుందని చెప్పారు. “ఇది మనందరికీ ప్రయోజనం” అన్నదే ఆయన సంక్షిప్త స్పందన. అయితే గ్రీన్‌ల్యాండ్‌లో ఈ అంశంపై అందరి అభిప్