హమారా ప్రసాద్‌పై కేసు నమోదు చేయాలని అర్బన్ సీఐకి బీఎస్పీ, మాల మహానాడు ఫిర్యాదు ‘కల్పిత నాయకుడు’ పుస్తకాన్ని సీజ్ చేసి రచయితపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ నందికొట్కూరు, ఆంధ్రప్రభ: భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ‘కల్పిత నాయకుడు’ అనే పుస్తకం రాసిన హమారా ప్రసాద్‌పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని కోరుతూ నందికొట్కూరు రూరల్ సీఐ అశోక్‌కుమార్‌కు బహుజన సమాజ్ పార్టీ, పీవీ రావు మాల మహానాడు ఆధ్వర్యంలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ డి. వెంకటేశ్ మాట్లాడుతూ అంబేద్కర్‌ను కించపరిచేలా పుస్తకం రాశారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న హమారా ప్రసాద్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, ఆయన రాసిన పుస్తకాలను ఆన్‌లైన్, డిజిటల్ వేదికలు, సోషల్ మీడియాలో ప్రచారం కాకుండా సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. అంబేద్కర్‌ను హిందూ వ్యతిరేకి, దేశద్రోహి, వేర్పాటువాది అంటూ మత విద్వేషాలు రెచ్చగొట్టేలా వాట్సాప్, ఫేస్‌బుక్‌లో అసభ్య పదజాలంతో వీడియోలు షేర్ చేస్తున్నారని ఆరోపిస్తూ, దీనిపై సమగ్ర విచారణ జరిపి చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. ‘కల్పిత నాయకుడు’ పుస్తకంపై వివాదం నేపథ్యంలో ఇతర ప్రాంతాల్లోనూ ఫిర్యాదులు, నిరసనలు చోటుచేసుకున్నట్లు వార్తా కథనాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో పుస్తకంలోని అభ్యంతరకర అంశాలపై సమగ్ర విచారణ జరిపి, చట్టపరంగా తప్పిదం ఉన్నట్లు తేలితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మాల మహానాడు నాయకులు భాస్కర్, ధర్మరాజు, స్మశాన కార్మికుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు నాగరాజు, బీఎస్పీ నంద్యాల జిల్లా అధ్యక్షులు గద్దల లాజర్, తిరుపతయ్య, నాగరాజు తదితరులు పాల్గొన్నారు