నర్సాపూర్: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఆరోపించారు. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడమే లక్ష్యంగా సెప్టెంబర్ 1 నుంచి 8వ తేదీ వరకు నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. శనివారం నర్సాపూర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలతో నిరసన కార్యక్రమాల విజయవంతంపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఆరు గ్యారంటీలు, 420 హామీలతో అధికారంలోకి వచ్చి, ప్రస్తుతం వాటిని విస్మరించిందని విమర్శించారు. ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగులతో పాటు రిటైర్డ్ ఉద్యోగులను కూడా ఇబ్బందులకు గురిచేస్తోందని సునీత లక్ష్మారెడ్డి ఆరోపించారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించకుండా రాజకీయ విమర్శలకు ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందంటూ గతంలో ఆరోపణలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇప్పుడు ఆ అంశంపై మాట మార్చిందని ఆమె విమర్శించారు. ప్రజలను ఇతర అంశాల వైపు మళ్లిస్తూ మాజీ సీఎం కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావులను విమర్శించడమే సీఎం రేవంత్‌రెడ్డి లక్ష్యంగా పెట్టుకున్నారని ఆరోపించారు. పెండుర్తి–శెట్టిపల్లి రహదారి పనులు పూర్తి చేయాలి గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో సీఎం కేసీఆర్ పెండుర్తి నుంచి శెట్టిపల్లి వరకు రహదారి నిర్మాణం, ఆర్‌బీటీ పనులకు రూ.18 కోట్లు మంజూరు చేశారని సునీత లక్ష్మారెడ్డి తెలిపారు. తండాలను పిలిచి అగ్రిమెంట్లు చేసినప్పటికీ ప్రస్తుతం పనులు నిలిచిపోయాయని ఆరోపించారు. రహదారి నిర్మాణ పనులను వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 31న వెల్దుర్తి నుంచి శెట్టిపల్లి వరకు పాదయాత్ర నిర్వహించనున్నట్లు ప్రకటించారు. సెప్టెంబర్ 1 నుంచి 8వ తేదీ వరకు నిర్వహించే నిరసన కార్యక్రమాల్లో బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలతో పాటు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని సునీత లక్ష్మారెడ్డి పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు