Shorts Anakapalle: అనకాపల్లి ఎన్టీఆర్ వైద్యశాల సమీపంలోని అన్న క్యాంటీన్‌ను జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణతో కలిసి క్యాంటీన్‌లోని వంటగది, భోజన ప్రాంగణం, తాగునీటి సౌకర్యాలను పరిశీలించారు. క్యాంటీన్‌లో వండుతున్న ఆహారం నాణ్యత, పరిశుభ్రత, వంటగది నిర్వహణ తీరును కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. మెనూ ప్రకారం నిర్ణీత సమయానికి భోజనం అందిస్తున్నారా లేదా, ప్రతిరోజూ ఎంతమంది పేదలు, ఆసుపత్రికి వచ్చే రోగుల బంధువులు క్యాంటీన్ సేవలను వినియోగించుకుంటున్నారు అనే వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. రూ.5కే అందిస్తున్న భోజనంపై వినియోగదారుల సంతృప్తి, ఆహారం నాణ్యత, పరిమాణం వంటి అంశాలపై కలెక్టర్ నేరుగా ప్రజలను అడిగి తెలుసుకున్నారు. క్యాంటీన్ సేవలపై ఏవైనా ఫిర్యాదులు ఉన్నాయా అనే విషయాన్ని కూడా ఆరా తీశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్ మాట్లాడుతూ అన్న క్యాంటీన్ల ద్వారా పేదలకు పరిశుభ్రమైన, నాణ్యమైన, రుచికరమైన భోజనం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఆహార పదార్థాల నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని సిబ్బందికి స్పష్టం చేశారు. క్యాంటీన్ పరిసరాలు, వంటగదిని నిరంతరం పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. అన్న క్యాంటీన్‌కు వచ్చే ప్రతి ఒక్కరికీ నాణ్యమైన ఆహారం, మెరుగైన సేవలు అందేలా అధికారులు, సిబ్బంది బాధ్యతగా వ్యవహరించాలని కలెక్టర్ సూచించారు. ఈ తనిఖీలో జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్‌తో పాటు అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు