Kaizer News

ధ్యాన్‌చంద్‌ స్ఫూర్తితో జాతీయ క్రీడాకారులుగా ఎదగాల

ధ్యాన్‌చంద్‌ స్ఫూర్తితో జాతీయ క్రీడాకారులుగా ఎదగాలి

· Sports · prabhanews.com

అవనిగడ్డ, ఆంధ్రప్రభ: మేజర్‌ ధ్యాన్‌చంద్‌ స్ఫూర్తితో విద్యార్థులు జాతీయ స్థాయి క్రీడాకారులుగా ఎదగాలని నియోజకవర్గ యువనాయకులు మండలి వెంకట్రామ్‌ పిలుపునిచ్చారు. శనివారం అవనిగడ్డ ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో అవనిగడ్డ ఉపవిభాగ వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం ఆధ్వర్యంలో జాతీయ క్రీడా దినోత్సవం, మేజర్‌ ధ్యాన్‌చంద్‌ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన మండలి వెంకట్రామ్‌ మాట్లాడుతూ ధ్యాన్‌చంద్‌ గొప్ప క్రీడాకారుడిగా దేశానికి మూడు ఒలింపిక్‌ పతకాలు అందించడంతో పాటు భారతదేశానికి సేవ చేసిన మహనీయుడని కొనియాడారు. ఆయన జయంతిని పురస్కరించుకుని ప్రతి ఏటా నిర్వహించే జాతీయ క్రీడా దినోత్సవ స్ఫూర్తితో విద్యార్థులు తమకు ఆసక్తి ఉన్న క్రీడలో రాణించి జాతీయ స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. క్రీడల ద్వారా శారీరక దారుఢ్యంతో పాటు మానసిక వికాసం కలుగుతుందని అన్నారు. క్రీడల్లో పాల్గొనడం ద్వారా నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయని, గెలుపోటములను స్వీకరించే నైపుణ్యం జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొనేలా చేస్తుందని తెలిపారు. విద్య, క్రీడలకు ప్రాధాన్యమిచ్చే దివిసీమ ప్రాంతానికి చెందిన విద్యార్థులు అన్ని రంగాల్లో ఉన్నత స్థాయికి ఎదగాలని పిలుపునిచ్చారు. అనంతరం నిర్వహించిన క్రీడా పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. కబడ్డీ పోటీల్లో స్వతంత్రపురం జెడ్పీ ఉన్నత పాఠశాల బాలురు, బాలికలు విజేతలుగా నిలిచి బహుమతులు అందుకున్నారు. కార్యక్రమాన్ని సంఘం అధ్యక్షుడు బీవీ వెంకటేశ్వరరావు, కార్యదర్శి బీపీఎల్‌ ప్రసాద్‌, కోశాధికారి తోట నవీన్‌, వ్యాయామ ఉపాధ్యాయులు నిర్వహించారు. జాతీయ క్రీడా దినోత్సవ వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన క్రీడా జ్యోతిని మండలి వెంకట్రామ్‌ వెలిగించి క్రీడా ర్యాలీని ప్రారంభించారు. వందలాది మంది విద్యార్థులు త్రివర్ణ పతాకాలు, క్రీడా పతాకాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో పాల్గొన్న విద్యార్థులు మేజర్‌ ధ్యాన్‌చంద్‌కు ఘనంగా నివాళులర్పించారు. జాతీయ పతాకాలతో సాగిన ర్యాలీలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు

Original source: prabhanews.com
Read more on Kaizer News