జలసిరి మధ్య సాగు, తాగునీటి కష్టాలు శిథిలావస్థకు చేరిన ఎమ్మెల్యే కార్యాలయం.. కర్నూలు కేంద్రంగా పాలనపై విమర్శలు వైద్యం కోసం పొరుగు రాష్ట్రానికి పరుగులు.. అభివృద్ధి హామీలపై ప్రజల్లో అసంతృప్తి మానవపాడు, ఆంధ్రప్రభ: దక్షిణ కాశీగా పేరుగాంచి, అష్టాదశ శక్తిపీఠాల్లో ఐదవదైన జోగులాంబ దేవి కొలువైన పవిత్ర పుణ్యభూమి గద్వాల్ జిల్లా అలంపూర్ నియోజకవర్గం నేడు తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతోంది. జీవనదులైన కృష్ణా, తుంగభద్ర నదులు పారే పవిత్ర సంగమ క్షేత్రంలో పుట్టిన నియోజకవర్గమైనప్పటికీ.. ఇక్కడి ప్రజలకు మాత్రం దాహార్తి తప్పడం లేదు. చుట్టూ జలసిరి పలకరిస్తున్నా, రైతుల పంట పొలాలకు సాగునీరు అందక గొంతు ఎండిపోతోంది. పచ్చని పైర్లు పండాల్సిన భూముల్లో ఎడారి ఛాయలు అలముకోవడంతో, వేరే దారి లేక అన్నదాతలు పొట్టకూటి కోసం ఇతర ప్రాంతాలకు వలస బాట పడుతున్నారు. నదుల మధ్య బతుకుతూనే మంచినీటికి తిప్పలు పడుతున్నారు. మల్లమ్మకుంట రిజర్వాయర్ పేరు పదేళ్లుగా వింటున్నప్పటికీ.. ఆ రిజర్వాయర్‌లో నీటిని చూసే అవకాశం మాత్రం ఇక్కడి వారికి దక్కలేదు. సాగునీరు లేక.. తాగునీటికి దిక్కులేక.. కూటి కోసం పొట్ట చేత పట్టుకున్న అనేక కుటుంబాల వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇక్కడి నుంచే వందలాది కుటుంబాలు ఇప్పటికీ హైదరాబాద్, ముంబైకి వలస వెళ్తున్నాయని ఉండవల్లి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శక్తిపీఠాల్లో ఒకటైన ఇక్కడి జోగులాంబ గుడికి కోట్ల రూపాయలు ప్రకటిస్తారు. కానీ అదే దేవుడి దర్శనానికి వచ్చే భక్తుడికి కనీస మరుగుదొడ్డి, తాగునీరు కూడా సరిగా లేవు. అలంపూర్ చౌరస్తాలో నిలువ నీడ లేక ప్రయాణికులు ఎండలోనే ఉండాల్సిన పరిస్థితి దాపురించింది. వైద్యం అందని ద్రాక్షగా మారింది. అలంపూర్ చౌరస్తాలో రూ.23.75 కోట్లతో 100 పడకల ఆసుపత్రి నిర్మాణం ప్రకటించారు. కానీ, ఇప్పటికీ పూర్తి స్థాయి వసతులు, వైద్యులు లేరు. అలంపూర్ దవాఖానలో పూర్తి స్థాయిలో వైద్యులను కూడా నియమించలేదు. పెద్ద జబ్బు చేస్తే కర్నూల్ ఆసుపత్రికి పరుగులు తీయాల్సిందే. ఉండవల్లి లాంటి పెద్ద మండలంలో కనీసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కూడా లేదు. మరోవైపు ప్రజల కష్టాలను దగ్గరుండి తీర్చాల్సిన స్థానిక శాసనసభ్యుడు నియోజకవర్గాన్ని పూర్తిగా విస్మరించారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అలంపూర్ పాలనంతా పొరుగు రాష్ట్రంలోని కర్నూలు వేదికగానే సాగుతోంది. స్థానికంగా ఎదురవుతున్న సమస్యలను విన్నవించుకోవాలన్నా, కష్టం చెప్పుకోవాలన్నా సామాన్య ప్రజలు సరిహద్దులు దాటి కర్నూలులోని ఎమ్మెల్యే బంగ్లా చుట్టూ తిరగాల్సిన దుస్థితి దాపురించింది. ఇక్కడ నియోజకవర్గ కేంద్రంలోని అలంపూర్ ఎమ్మెల్యే కార్యాలయం పర్యవేక్షణ కరువై, నాథుడే లేక శిథిలావస్థకు చేరుకోవడం ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యానికి సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది. ఎన్నికల సమయంలో నాయకులు గుప్పించిన హామీలన్నీ నదుల్లో తేలే బుడగల్లా తేలిపోగా.. నియోజకవర్గ అభివృద్ధి ఎండమావిని తలపిస్తోంది. రెండు నదుల నడుమ ఉన్నా నీళ్లకు నోచుకోక, సమస్యలు చెప్పుకుందామన్నా ప్రజాప్రతినిధులు అందుబాటులో లేక అలంపూర్ జనం నిస్సహాయంగా రోదిస్తున్నారు