ఇంద్రకీలాద్రి నుంచి ఆరుగురు అర్చకుల విదేశీ ప్రయాణానికి ప్రతిపాదన విజయవాడ, ఆంధ్రప్రభ: ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం నుంచి ఆరుగురు వైదిక సిబ్బందిని ఆస్ట్రేలియాకు పంపే ప్రతిపాదన తెరపైకి వచ్చింది. అక్కడి ప్రవాస భారతీయ భక్తుల కోసం అమ్మవారి కళ్యాణ మహోత్సవం, కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహించేందుకు అర్చకులను డిప్యుటేషన్‌పై పంపాలని ప్రతిపాదించారు. అయితే విదేశీ ప్రయాణానికి సంబంధించిన పాత నిబంధనలు, తిరిగి వచ్చిన తర్వాత అర్చకుల గర్భగృహ సేవలపై ఉన్న న్యాయపరమైన చిక్కుముడుల నేపథ్యంలో ఈ ప్రతిపాదన ఆసక్తికరంగా మారింది. ఆస్ట్రేలియాలోని ‘శ్రీ శివ జ్యోతి టెంపుల్ లిమిటెడ్’ సంస్థ ఆధ్వర్యంలో అక్టోబరు 26 నుంచి నవంబరు 9 వరకు శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల కళ్యాణ మహోత్సవం, కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమాల కోసం దేవస్థానం నుంచి ఆరుగురు అర్చకులను పంపాలని ఏపీఎన్‌ఆర్‌టీసీ సొసైటీ ద్వారా దేవస్థానానికి ప్రతిపాదనలు అందాయి. అర్చకుల ప్రయాణం, వసతి, ఇతర ఏర్పాట్లకు సంబంధించిన ఖర్చులన్నింటినీ నిర్వాహక సంస్థే భరించనున్నట్లు ప్రతిపాదనలో పేర్కొన్నారు. దీనిపై దేవస్థానం ధర్మకర్తల మండలి ఆమోదం కోసం ఎజెండా సిద్ధం చేసినట్లు సమాచారం. అర్చకులను విదేశాలకు పంపే అంశంలో 2010లో జారీ చేసిన నిబంధనలు ఇప్పుడు ప్రధాన చర్చగా మారాయి. ఆంధ్రప్రదేశ్ ధార్మిక పరిషత్ 2010 నవంబరు 10న జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం విదేశాలకు వెళ్లిన అర్చకులు తిరిగి వచ్చిన తర్వాత ప్రధాన ఆలయ గర్భగృహంలో సేవలు నిర్వహించడంపై కొన్ని పరిమితులు ఉన్నట్లు ప్రతిపాదనలో ప్రస్తావించారు. అయితే ఆలయ పరిసరాల్లో వ్రతాలు, పూజలు వంటి ఇతర మతపరమైన సేవలు నిర్వహించేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. విదేశీ ప్రయాణం చేసి వచ్చిన అర్చకులు గర్భగృహంలో పూజా కార్యక్రమాలు నిర్వహించడంపై ఇటీవల న్యాయస్థానాల్లో వివాదాలు కొనసాగుతున్న అంశం కూడా చర్చకు వచ్చింది. ఈ ప్రతిపాదనపై దేవస్థానం వైదిక కమిటీని సంప్రదించగా సానుకూల అభిప్రాయం వ్యక్తమైనట్లు తెలుస్తోంది. గతంలో అమెరికాలో రెండు పర్యాయాలు దేవస్థానం నుంచి శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల కళ్యాణోత్సవం, కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహించిన విషయాన్ని కమిటీ గుర్తు చేసింది. ఇలాంటి కార్యక్రమాల ద్వారా ప్రవాస భారతీయులకు దేవస్థాన సంప్రదాయాలు, ఆగమశాస్త్ర విధానాలు, సనాతన ధర్మ విశిష్టత మరింత చేరువవుతాయని కమిటీ అభిప్రాయపడింది. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను విదేశాల్లోని తెలుగు, భారతీయ భక్తులకు పరిచయం చేయడంతో పాటు ధర్మ ప్రచారానికి కూడా ఇది ఉపయోగపడుతుందని పేర్కొంది. ఒకవైపు ప్రవాస భారతీయ భక్తుల విజ్ఞప్తి, ధర్మ ప్రచారానికి అవకాశం ఉండగా.. మరోవైపు విదేశీ ప్రయాణ నిబంధనలు, అర్చకుల తిరుగు ప్రయాణం తర్వాత గర్భగృహ సేవలకు సంబంధించిన అంశాలు ఉండటంతో తుది నిర్ణయం ఇప్పుడు ధర్మకర్తల మండలిపై ఆధారపడింది. ఆరుగురు వైదిక సిబ్బందిని ఆస్ట్రేలియాకు డిప్యుటేషన్‌పై పంపే ప్రతిపాదనకు పాలకమండలి ఆమోదం లభిస్తుందా? లేక నిబంధనలు, న్యాయపరమైన అంశాలను పరిగణనలోకి తీసుకుని మరో నిర్ణయం తీసుకుంటుందా? అన్నది ఆసక్