Kaizer News

ఆక్రమిత అటవీ భూములకు మళ్లీ పచ్చదనం..

ఆక్రమిత అటవీ భూములకు మళ్లీ పచ్చదనం..

· State - Telangana · prabhanews.com

ఎకరాల అటవీ భూమి స్వాధీనం.. మొక్కల పెంపకానికి చర్యలు అటవీ భూములు ఆక్రమిస్తే క్రిమినల్‌ కేసులు.. : ఎఫ్‌డీఓ రామ్మోహన్ జన్నారం, ఆంధ్రప్రభ : ఆక్రమణదారుల చెర నుంచి స్వాధీనం చేసుకున్న అటవీ భూముల్లో మళ్లీ పచ్చదనం పెంచేందుకు అటవీశాఖ చర్యలు చేపట్టింది. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని కవ్వాల టైగర్‌ రిజర్వ్‌, జన్నారం అటవీ డివిజన్‌ పరిధిలో ఇప్పటివరకు సుమారు 250 ఎకరాల అటవీ భూమిని స్వాధీనం చేసుకున్న అధికారులు, ఆయా ప్రాంతాల్లో కందకాలు తవ్వి మొక్కలు నాటుతున్నారు. జన్నారం, ఇందనపల్లి, తాళ్లపేట అటవీ రేంజుల పరిధిలో ఉన్న ఆక్రమిత భూములను అటవీశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు స్వాధీనం చేసుకుంటున్నట్లు ఎఫ్‌డీఓ రామ్మోహన్ తెలిపారు. భూములను తిరిగి అటవీశాఖ ఆధీనంలోకి తీసుకున్న అనంతరం హద్దులను గుర్తిస్తూ కందకాలు తవ్వి, నీటి నిల్వకు అనువైన గుంతలు ఏర్పాటు చేసి మొక్కలు నాటుతున్నట్లు చెప్పారు. తాజాగా జన్నారం అటవీ రేంజ్‌లోని జన్నారం ఫారెస్ట్‌ బీట్‌, కంపార్ట్‌మెంట్‌ నంబర్‌ 308 పరిధిలో లక్ష్మిపూర్‌ తాండా వాసుల ఆక్రమణలో ఉన్న 25 ఎకరాల అటవీ భూమిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ భూమి చుట్టూ హద్దు కందకం తవ్వి, నీటి నిల్వ కోసం ప్రత్యేక గుంతలు ఏర్పాటు చేసి మొక్కలు నాటారు. ఇందనపల్లి రేంజ్‌లోని కవ్వాల పాలగోరి ప్రాంతంలో అక్రమంగా ఏర్పాటు చేసిన గుడిసెలను తొలగించినట్లు అధికారులు తెలిపారు. మురిమడుగు గ్రామ సమీపంలోని అటవీ భూమిని స్వాధీనం చేసుకుని హద్దు కందకాలు తవ్వించారు. అలాగే తాళ్లపేట రేంజ్‌లోని దమ్మన్నపేట, తపాల్‌పూర్‌ గ్రామాల సమీపంలో ఆక్రమణలకు గురైన అటవీ భూములను కూడా స్వాధీనం చేసుకుని ప్లాంటేషన్‌ కార్యక్రమాలు చేపట్టారు. జన్నారం అటవీ డివిజన్‌ పరిధిలో అటవీ భూములను ఆక్రమించడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని ఎఫ్‌డీఓ రామ్మోహన్ హెచ్చరించారు. శనివారం తన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కవ్వాల టైగర్‌ రిజర్వ్‌ పరిధిలోని ఆక్రమిత అటవీ భూములను దశలవారీగా స్వాధీనం చేసుకుంటున్నామని తెలిపారు. గడ్డంగూడ, లక్ష్మిపూర్‌ తాండా పరిధిలో ఆక్రమణలో ఉన్న 25 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుని మొక్కలు నాటినట్లు చెప్పారు. ఆక్రమణదారుల్లో కొందరిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేశామని, మరికొందరిని తహసీల్దార్‌ ఎదుట బైండోవర్‌ చేసినట్లు తెలిపారు. స్వాధీనం చేసుకున్న అటవీ భూముల్లో విస్తృతంగా మొక్కలు నాటి అటవీ పునరుద్ధరణ కార్యక్రమాలు చేపడుతున్నామని రామ్మోహన్ పేర్కొన్నారు. భవిష్యత్తులో అటవీ భూములపై ఆక్రమణలు జరగకుండా మరింత కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అటవీ భూముల పరిరక్షణతో పాటు పచ్చదనం పెంపునకు అధికారులు చేపడుతున్న చర్యలను పలువురు అటవీ ప్రేమికులు అభినందించారు

Original source: prabhanews.com
Read more on Kaizer News