దేవస్థానం ఆధీనంలో..Andhra Prabha Exclusive Story విజయవాడ లోని ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానానికి వచ్చే భక్తుల వస్తు సామగ్రి, పాదరక్షల భద్రతకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. కొండపైన, దిగువన ఉన్న క్లోక్‌రూమ్, చెప్పుల స్టాండ్లను ఇకపై దేవస్థానం ఆధ్వర్యంలోనే నిర్వహించేందుకు చర్యలు చేపట్టనున్నారు. ఇందుకు అవసరమైన సిబ్బందిని టెండర్ ప్రక్రియ ద్వారా మ్యాన్‌పవర్ సప్లై విధానంలో సమకూర్చుకుని, దేవస్థాన సిబ్బంది ప్రత్యక్ష పర్యవేక్షణలో కౌంటర్లను నిర్వహించాలని ప్రతిపాదించారు. ప్రస్తుతం క్లోక్‌రూమ్, చెప్పుల స్టాండ్ల లైసెన్సు కాలపరిమితి అక్టోబరు 22తో ముగియనుంది. లైసెన్సుదారులు టెండర్‌లో నిర్ణయించిన రుసుముల కంటే అధికంగా భక్తుల నుంచి వసూలు చేస్తున్నారంటూ తరచూ పలువురు ఫిర్యాదులు చేసినట్లు దేవస్థానం పేర్కొంది. అంతేకాకుండా భక్తులతో దుర్భాషలాడటం, అమర్యాదగా ప్రవర్తించడం వంటి ఆరోపణలు కూడా వచ్చినట్లు తెలిపింది. దీంతో దేవస్థానం ప్రతిష్ఠకు భంగం కలుగుతోందని అధికారులు అభిప్రాయపడ్డారు. ఇదే సమయంలో టెండర్ దారులు తరచూ నిబంధనలో ఉల్లంఘిస్తుండడం, వరస ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ఇక టెండర్ ప్రక్రియకు పుల్ స్టాప్ పెట్టి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించేందుకు సన్నాహాలు ప్రారంభించారు. కొత్త విధానంలో భక్తుల పాదరక్షలను భద్రపరిచేందుకు జతకు రూ.2 చొప్పున, బ్యాగుకు రూ.10 చొప్పున మాత్రమే రుసుము వసూలు చేయనున్నారు. వసూలైన మొత్తాన్ని ఏ రోజుకారోజు దేవస్థానం నిధులకు జమ చేసేలా వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం అవసరమైన సిబ్బందిని మాన్ పవర్ కి సప్లై ద్వారా నియమించుకుని నిర్వహించాలని దేవస్థానం అధికారులు సన్నద్ధమవుతున్నారు. అక్టోబరు 23 నుంచి కొండపైన, దిగువన ఉన్న క్లోక్‌రూమ్, చెప్పుల స్టాండ్ కౌంటర్లను దేవస్థానం తరఫున నిర్వహించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని కార్యనిర్వహణాధికారి శీనా నాయక్ ప్రతిపాదించారు. సిబ్బందిని టెండర్ ద్వారా సమకూర్చుకున్నప్పటికీ, వారి కార్యకలాపాలను దేవస్థాన సిబ్బంది పర్యవేక్షించేలా విధానం రూపొందించనున్నారు. కార్యనిర్వహణాధికారి నోట్‌లో పేర్కొన్న ప్రతిపాదనలను ధర్మకర్తల మండలి పరిశీలించి తగిన తీర్మానం చేయాల్సి ఉంది. భక్తుల నుంచి అదనపు వసూళ్లకు అడ్డుకట్ట వేయడం, మర్యాదపూర్వక సేవలు అందించడం, వసూలైన రుసుమును దేవస్థానానికి పారదర్శకంగా జమ చేయడం ఈ విధానం ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది. అయితే గతంలో జరిగిన అనుభవాలను దృష్టిలో ఉంచుకుని అధికారులు ఈసారి పగడ్బందీ ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంది. దేవస్థాన ఆధ్వర్యంలో నిర్వహించేందుకు ఇప్పుడు పాలకమండలి సమ్మతిస్తుందా లేదా వేచి చూడాల్సిందే