Kaizer News

Kalyandurgam: కళ్యాణదుర్గం శ్రీ వివేకానంద స్కూల్‌ల

Kalyandurgam: కళ్యాణదుర్గం శ్రీ వివేకానంద స్కూల్‌లో తెలుగు భాషా దినోత్సవం!

· State - Telangana · hmtvlive.com

Kalyandurgam: కళ్యాణదుర్గంలోని శ్రీ వివేకానంద పబ్లిక్ స్కూల్‌లో తెలుగు భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తెలుగు భాషా వికాసానికి విశేష కృషి చేసిన గిడుగు వెంకట రామమూర్తి పంతులు జయంతిని పురస్కరించుకుని పాఠశాలలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. విద్యార్థుల్లో మాతృభాషపై అభిమానం, తెలుగు సాహిత్యం మరియు సంస్కృతిపై ఆసక్తిని పెంపొందించేలా కార్యక్రమాలను నిర్వహించారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు సి. గంగాధర మాట్లాడుతూ.. తెలుగు భాషకు ఉన్న గొప్పతనం, మాతృభాష ప్రాధాన్యతను విద్యార్థులకు వివరించారు. మన భావాలను సహజంగా వ్యక్తపరిచే భాష మాతృభాష అని, తెలుగు భాషను ప్రేమించి, గౌరవించి, భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు. నిత్య జీవితంలో తెలుగు భాష వినియోగాన్ని పెంచడంతో పాటు, తెలుగు సాహిత్యాన్ని చదివే అలవాటును విద్యార్థులు పెంపొందించుకోవాలని సూచించారు. పాఠశాల కరస్పాండెంట్ సునీత సంగప్ప, అకాడమిక్ డైరెక్టర్లు కె. సంగప్ప, కె. నరసింహాచారి కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులను అభినందించారు. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొనేలా ఉపాధ్యాయులు ప్రత్యేక కార్యక్రమాలను రూపొందించారు. ఈ సందర్భంగా తెలుగు ఉపాధ్యాయులు అనిల్ శ్రీకృష్ణదేవరాయల పాత్రలో ప్రత్యేక స్కిట్‌ను ప్రదర్శించారు. శ్రీకృష్ణదేవరాయల కాలంలో తెలుగు భాష, సాహిత్యం సాధించిన వైభవాన్ని ప్రతిబింబించేలా సాగిన ఈ స్కిట్ విద్యార్థులు, ఉపాధ్యాయులను ఆకట్టుకుంది. తెలుగు సాహిత్య అభివృద్ధిలో ఆ కాలానికి ఉన్న ప్రాధాన్యతను ప్రదర్శన ద్వారా చాటిచెప్పారు. అలాగే విద్యార్థులు తెలుగు పద్యాలు, ప్రసంగాలు, పాటలు, నృత్యాలు, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను ఉత్సాహంగా ప్రదర్శించారు. చిన్నారుల ప్రదర్శనలకు పాఠశాల ఆవరణలో మంచి స్పందన లభించింది. మాతృభాషపై అవగాహన కల్పించడంతో పాటు విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకత, ప్రతిభను వెలికితీసేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయని ఉపాధ్యాయులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు భీమప్ప, అనంతలక్ష్మి, అలివేణి, అశ్విని తదితరులు పాల్గొన్నారు. తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమాలు విజయవంతంగా ముగియడంతో పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులను పలువురు అభినందించారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News