తిరుపతి సిటీ బ్యూరో, ఆంధ్రప్రభ: ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పారదర్శకంగా, బాధ్యతాయుతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ఆదేశించారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంలో భాగంగా ఆదివారం తిరుపతి రూరల్ పరిధి చైతన్యపురంలోని మండల పరిషత్ పాఠశాలలో నిర్వహించిన ఓటర్ల జాబితా సవరణలు, అభ్యంతరాల స్వీకరణ శిబిరాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా శిబిరంలో అందుతున్న దరఖాస్తులు, క్లెయిమ్‌లు, అభ్యంతరాల నమోదు ప్రక్రియను కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. అనంతరం అధికారులకు సూచనలు చేస్తూ పేరు మార్పులు, చిరునామా సవరణలు, మరణించిన వారి పేర్ల తొలగింపు ప్రక్రియను క్షేత్రస్థాయి పరిశీలన తర్వాతే నిబంధనల ప్రకారం పూర్తి చేయాలని స్పష్టం చేశారు. అర్హులైన పౌరులందరూ తమ వివరాలను సరిచూసుకోవడానికి, కొత్త నమోదుల కోసం ఈ ప్రత్యేక శిబిరాలను ఉపయోగించుకోవాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. ఈ తనిఖీ కార్యక్రమంలో సంబంధిత రెవిన్యూ అధికారులు, బూత్ స్థాయి అధికారులు ఇతర సిబ్బంది పాల్గొన్నారు