న్యూఢిల్లీ, వెలుగు: నేపాల్‌లో సంభవించిన భారీ వరద నేపథ్యంలో తెలంగాణకు సంబంధించిన వ్యక్తుల ఆచూకీ, వారి సురక్షిత తరలింపు చర్యలపై రాష్ట్ర ప్రభుత్వం సహాయక చర్యలను ముమ్మరం చేసింది. విపత్తులో ప్రాణాలు విడిచిన వారి మృతదేహాల గుర్తింపు, స్వరాష్ట్రానికి తరలింపు అంశాలపై ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, కాఠ్మండ్లోని భారత రాయబార కార్యాలయం, నేపాల్ పోలీసులతో ఢిల్లీ తెలంగాణ భవన్ అధికారులు నిరంతర సమన్వయం కొనసాగిస్తున్నారు. నేపాల్ ప్రభుత్వం మృతుల ఫొటోలు, ప్రాథమిక వివరాలను నేపాల్ పోలీసుల డిజాస్టర్ పోర్టల్‌లో అందుబాటులో ఉంచిందని భవన్ అధికారులు ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. రసువా, నువాకోట్, ధాదింగ్, చిత్వన్, గోర్ఖా, తనహున్, నవల్పరాసీ తూర్పు, నవల్పరాసీ పశ్చిమ, ఖాట్మండ్ జిల్లాల్లో భద్రపరిచిన మృతదేహాల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోందని పేర్కొన్నారు. కాగా, తెలంగాణకు చెందిన అల్లి ఐయిలేష్ పేరు, పాస్‌పోర్టు వివరాలు తమ వద్ద ఉన్న రికార్డులతో సరిపోలినట్లు భవన్ అధికారులు వెల్లడించారు. కుటుంబ సభ్యులు ప్రత్యక్షంగా గుర్తించగలిగిన సందర్భాల్లో డీఎన్‌ఏ పరీక్ష తప్పనిసరి కాదని నేపాల్ ప్రభుత్వం సమాచారం ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. మృతుడితో బంధుత్వాన్ని నిర్ధారించే ఆధారాలతో మృతదేహాలను సంబంధిత కుటుంబాలకు అప్పగిస్తారని పేర్కొన్నారు. ప్రత్యక్ష గుర్తింపు సాధ్యం కాని సందర్భాల్లో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, మొదటి-స్థాయి బంధువుల డీఎన్‌ఏ ప్రొఫైల్‌ను సరిపోల్చే ప్రక్రియ చేపడతారని తెలిపారు. ఇందుకోసం బంధువులు తప్పనిసరిగా నేపాల్‌కు ప్రయాణించాల్సిన అవసరం లేదని, స్వస్థలంలో సిద్ధం చేసిన డీఎన్‌ఏ ప్రొఫైల్‌ను సమర్పించే అవకాశం ఉందని చెప్పారు. దీనికి సంబంధించిన ఈ-మెయిల్ విధానాన్ని నేపాల్ పోలీసులు ఫాలు అవుతున్నట్లు వెల్లడించారు