Shorts అనకాపల్లి జిల్లా: అనకాపల్లిలోని ఎన్టీఆర్ వైద్యశాల సమీపంలో ఉన్న అన్న క్యాంటీన్‌ను జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనకాపల్లి శాసనసభ్యులు కొణతాల రామకృష్ణతో కలిసి క్యాంటీన్‌లోని వంటగది, భోజన ప్రాంగణం, తాగునీటి సౌకర్యాలను పరిశీలించారు. ఈ సందర్భంగా క్యాంటీన్‌లో వండుతున్న ఆహారం నాణ్యత, పరిశుభ్రత, వంటగది నిర్వహణ తీరును జిల్లా కలెక్టర్ పరిశీలించారు. మెనూ ప్రకారం నిర్ణీత సమయానికి ఆహారం అందిస్తున్నారా లేదా, రోజువారీగా ఎంతమంది పేదలు, ఆసుపత్రికి వచ్చే రోగుల బంధువులు క్యాంటీన్ సేవలను వినియోగించుకుంటున్నారు అనే వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. రూ.5లకే అందిస్తున్న భోజన సౌకర్యంపై ప్రజల సంతృప్తి స్థాయిని, భోజనం నాణ్యత, పరిమాణంపై వినియోగదారుల నుంచి ఏవైనా ఫిర్యాదులు వస్తున్నాయా అనే విషయాలను కూడా కలెక్టర్ నేరుగా వినియోగదారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అన్న క్యాంటీన్ల ద్వారా పేదలకు పరిశుభ్రమైన, నాణ్యమైన, రుచికరమైన భోజనం అందించడమే లక్ష్యమన్నారు. ఆహార పదార్థాల నాణ్యత విషయంలో ఎటువంటి రాజీ లేకుండా, క్యాంటీన్ పరిసరాలు, వంటగది పరిశుభ్రతను నిరంతరం పాటించాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌తో పాటు అనకాపల్లి శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు