Shorts మలికిపురం: గ్రామాల్లోని ప్రతి ఇంటికి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ భావజాలాన్ని, ఆయన ఆశయాలను తీసుకెళ్లే లక్ష్యంతో దళిత చైతన్య వేదిక ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘ఇంటింటా అంబేడ్కర్’ కార్యక్రమానికి సంబంధించిన బుక్‌లెట్లను ఆదివారం మలికిపురం ఫూలే అంబేడ్కర్ భవనంలో ఆవిష్కరించారు. రాజోలు నియోజకవర్గ దళిత సంఘాల జేఏసీ నాయకులు బత్తుల లక్ష్మణరావు, దేవ రాజేంద్రప్రసాద్, తోటే ప్రతాప్‌లు ఈ బుక్‌లెట్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ.. సమాజంలో సమానత్వం, సామాజిక న్యాయం, విద్య, హక్కులపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు అంబేడ్కర్ భావజాలాన్ని ప్రతి ఇంటికీ చేరవేయడం అభినందనీయమని తెలిపారు. అంబేడ్కర్ రచనలు, ఆయన ఆలోచనలు, రాజ్యాంగ విలువలను ప్రజలకు పరిచయం చేయడం ద్వారా దళిత, బహుజన వర్గాల్లో చైతన్యం పెంపొందించవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని రూపొందించి ముందుకు తీసుకెళ్తున్న దళిత చైతన్య వేదిక కార్యవర్గ సభ్యులను వారు అభినందించారు. తొలుత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం అంబేడ్కర్ ఆశయాలను కొనసాగిస్తామంటూ పెద్దఎత్తున నినాదాలు చేస్తూ నాయకులు ప్రతిజ్ఞ చేశారు. అంబేడ్కర్ చూపిన సామాజిక న్యాయం, సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం వంటి రాజ్యాంగ విలువలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని తెలిపారు. అనంతరం ‘ఇంటింటా అంబేడ్కర్’ కార్యక్రమానికి రూపకల్పన చేసిన దళిత చైతన్య వేదిక వ్యవస్థాపకులు బత్తుల మురళీకృష్ణను జేఏసీ నాయకులు శాలువా, జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కార్యక్రమం ఉద్దేశాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. గ్రామస్థాయిలో ప్రజలను భాగస్వాములను చేస్తూ అంబేడ్కర్ ఆశయాల ప్రచారాన్ని విస్తృతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు మట్టా సురేష్, చిలకపాటి శ్రీధర్, డాక్టర్ జేసురత్నం, చెల్లుబోయిన తాతారావు, గెడ్డం ప్రభాకరరావు, బత్తుల రవిప్రసాద్, వి. చిట్టిబాబు, మోకా రమేష్, తోటే రాజేష్, మందపాటి మధు, బొడ్డపల్లి ప్రసాద్, గోగి మోహన్, మెడబల శ్యాం శేఖర్, పొన్నమాటి భాస్కర్, బుంగ శ్రీను, తాడి మున్మోహన్ రెడ్డి, తాడి సహదేవుడు, తాడి నీలకంఠం, గుఱ్ఱం మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు