Kaizer News

Nandyal: పింఛన్ల అర్హతలకు 6 దశల ధ్రువీకరణ పక్కాగా

Nandyal: పింఛన్ల అర్హతలకు 6 దశల ధ్రువీకరణ పక్కాగా ఉండాలి: కలెక్టర్

· State - Telangana · hmtvlive.com

Shorts నంద్యాల: పింఛన్ల మంజూరులో ప్రభుత్వం నిర్దేశించిన ఆరు దశల ధ్రువీకరణ (Six-Step Validation) ప్రక్రియను పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి ఎంపీడీవోలు, సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి పింఛన్ల అర్హతలు, దరఖాస్తుల పరిశీలనపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎంపీడీఓలతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పింఛన్ లబ్ధిదారుల ఎంపికలో కుటుంబాన్ని (Household) ప్రామాణికంగా తీసుకుని ప్రభుత్వం నిర్దేశించిన ఆరు అర్హత ప్రమాణాలను తప్పనిసరిగా పరిశీలించాలని సూచించారు. కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగి ఉండటం, నెలకు సగటున 300 యూనిట్లకు మించి విద్యుత్ వినియోగం ఉండటం, నిర్ణీత పరిమితికి మించి వ్యవసాయ భూమి కలిగి ఉండటం, పట్టణ ప్రాంతాల్లో 1,000 చదరపు అడుగులకు మించి ఆస్తి కలిగి ఉండటం, కుటుంబంలో ఆదాయ పన్ను చెల్లించేవారు ఉండటం, నాలుగు చక్రాల వాహనం కలిగి ఉండటం వంటి అంశాలను జాగ్రత్తగా పరిశీలించి అర్హతను నిర్ధారించాలన్నారు. మాగాణి భూమి మూడు ఎకరాలలోపు, మెట్ట భూమి పది ఎకరాలలోపు ఉండేలా భూ పరిమితులను పరిశీలించాలని, మాగాణి, మెట్ట భూములు కలిపి పది ఎకరాలకు మించకుండా ఉన్నాయా లేదా అనే అంశాన్ని కూడా ధ్రువీకరించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. కేవలం వేర్వేరు రైస్ కార్డులు ఉన్నాయనే కారణంతో ప్రత్యేక కుటుంబంగా పరిగణించి పింఛన్ మంజూరు చేయరాదని, హౌస్‌హోల్డ్ ఆధారంగా అర్హతను పరిశీలించాల్సి ఉంటుందని తెలిపారు. డప్పు కళాకారులు, చర్మకారులు, చేనేత కార్మికుల పింఛన్ దరఖాస్తులను ప్రభుత్వం నిర్దేశించిన వయోపరిమితి, ధ్రువీకరణ పత్రాల ఆధారంగా పరిశీలించాలని కలెక్టర్ ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను సకాలంలో క్లియర్ చేసి, పింఛన్ల పోర్టల్‌లో డేటా అప్‌లోడ్‌కు ముందే వివరాలు, పత్రాలు, అర్హతలను పూర్తిస్థాయిలో ధ్రువీకరించాలన్నారు. ట్రాన్స్‌జెండర్లు, దివ్యాంగుల సంక్షేమానికి సంబంధించిన పింఛన్ లబ్ధిదారుల వివరాలను సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుని ధ్రువీకరించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. తహశీల్దార్లు, ఎంపీడీఓలు, సాంఘిక సంక్షేమం, చేనేత, మత్స్య, మైనారిటీ సంక్షేమం తదితర శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి అర్హులైన ప్రతి లబ్ధిదారునికి పింఛన్ అందేలా, అనర్హులకు మంజూరు కాకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అన్ని మండలాల ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News