బ్రహ్మోత్సవాల నాటికి సగం పనులు పూర్తి చిన్నచింతకుంట, ఆంధ్రప్రభ : మహబూబ్‌నగర్ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ కురుమూర్తి స్వామి దేవస్థాన ఘాట్ రోడ్డు పనులు రూ.110 కోట్ల నిధులతో శరవేగంగా కొనసాగుతున్నాయని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, జిల్లా మత్స్య, క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. రాబోయే బ్రహ్మోత్సవాల నాటికి ఘాట్ రోడ్డు పనుల్లో సగం పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. చిన్నచింతకుంట మండల పరిధిలోని కురుమూర్తి స్వామి జాతర సమీపంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రులు దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్‌రెడ్డితో కలిసి మాట్లాడారు. ఉమ్మడి మండల పరిధిలోని ముచ్చింతల గ్రామంలో రూ.41 కోట్లతో వాగుపై హై లెవల్ వంతెన నిర్మాణం, రెండు లైన్ల రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. పాలమూరు ప్రాంతానికి సాగునీరు అందించడమే లక్ష్యంగా ఉద్దండపూర్ ప్రాజెక్టు భూసేకరణ కోసం రూ.560 కోట్లు విడుదల చేసినట్లు మంత్రి తెలిపారు. కరివెన రిజర్వాయర్ కాలువల పనులను కూడా వేగవంతం చేసి వచ్చే ఏడాదిలోగా ప్రాజెక్టును అందుబాటులోకి తీసుకురావడానికి చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను ప్రస్తుత ప్రభుత్వం ప్రాధాన్యతతో ముందుకు తీసుకెళ్తోందని మంత్రులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి మండల నాయకులు, నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు