న్యూయార్క్‌లో జాగ్రత్త Andhra Prabha Top News అమెరికా–ఇరాన్ మధ్య మాటల మంటలు మరోసారి రాజుకున్నాయి. తమపై వైట్‌హౌస్ ఆరోపణలను ఇరాన్ తిప్పికొట్టింది. వాషింగ్టన్ తమపై చేస్తున్న ఆరోపణల్లో అత్యధికం.. అమెరికా స్వయంగా మొదలుపెట్టిన, అమలు చేసిన లేదా మద్దతిచ్చిన చర్యలేనంటూ ఘాటుగా బదులిచ్చింది. ఐక్యరాజ్యసమితి (యూఎన్) సర్వసభ్య సమావేశాల ఉన్నతస్థాయి వారోత్సవాల వేళ ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతుండటం అంతర్జాతీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. వైట్‌హౌస్ నుంచి వెలువడిన సుదీర్ఘ ఆరోపణల జాబితాపై ఇరాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయీ శనివారం (స్థానిక కాలమానం) ఎక్స్ వేదికగా స్పందించారు. అమెరికా చేసిన ఆరోపణలను నిశితంగా పరిశీలిస్తే.. వాటిలో అత్యధికం అగ్రరాజ్యం స్వయంగా ప్రారంభించిన, పాల్పడిన లేదా సమర్థించిన చర్యలనే వివరిస్తున్నాయని వ్యాఖ్యానించారు. వాస్తవాల నుంచి తప్పించుకుంటూ.. ఇతరులపై తమ చర్యలను ఆపాదించడం ఆశ్చర్యకరమేమీ కాదంటూ సామెతలను ఉటంకిస్తూ వైట్‌హౌస్‌పై విమర్శలు గుప్పించారు. ఐరాస సర్వసభ్య సమావేశాలకు హాజరయ్యేందుకు న్యూయార్క్ వెళ్లనున్న ఇరాన్ ప్రతినిధి బృందానికి బఘాయీ కీలక సూచనలు చేశారు. తమ వైఖరిలో బలహీనత ఉన్నట్లు శత్రువులు భావించే ఎలాంటి సంకేతాలూ వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. న్యూయార్క్ పర్యటన ఇరాన్ దౌత్యవేత్తలకు పెద్దగా ఆసక్తికరమైన విషయం కాకపోయినా.. ఐరాస సర్వసభ్య సమావేశంలో పాల్గొనడం తమ హక్కని స్పష్టం చేశారు. ఈ వేదికను ఇరాన్ ప్రజల న్యాయబద్ధమైన వాదనను బలంగా వినిపించేందుకు వినియోగించుకోవాలని పేర్కొన్నారు. ఇరాన్ అధికారుల న్యూయార్క్ పర్యటనపై అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి టామీ పిగాట్ చేసిన వ్యాఖ్యలు ఈ వివాదానికి మరింత ఆజ్యం పోశాయి. ఐరాస సమావేశాల పేరుతో ఇరాన్ అధికారులు విలాసవంతమైన షాపింగ్‌కు పాల్పడాలని చూస్తున్నారంటూ ఆయన ఆరోపించారు. ఇరాన్ ప్రజల కష్టాల నుంచి వచ్చిన సొమ్ముతో విలాస వస్తువులు కొనుగోలు చేయడాన్ని తమ ప్రభుత్వం అనుమతించబోదని ఎక్స్‌లో పేర్కొన్నారు. ఐరాస ఉన్నతస్థాయి సమావేశాల్లో పాల్గొనేందుకు ఇరాన్ ప్రధాన ప్రతినిధి బృందానికి అమెరికా విదేశాంగ శాఖ వీసాలు మంజూరు చేసింది. అయితే, ఆ బృందంపై ప్రయాణ ఆంక్షలు, విలాసవంతమైన వస్తువులతో పాటు ఇతర వస్తువుల కొనుగోళ్లపై నిషేధాలు ఉంటాయని స్పష్టం చేసింది. ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్, విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ సహా కీలక ప్రతినిధులు ఈ బృందంలో ఉన్నట్లు సమాచారం. సెప్టెంబర్ 18 నుంచి 28 వరకు న్యూయార్క్‌లోని ఐరాస ప్రధాన కార్యాలయంలో 81వ సర్వసభ్య సమావేశాల ఉన్నతస్థాయి వారోత్సవాలు జరుగుతున్నాయి. హోర్ముజ్ జలసంధి అంశంతో పాటు ఇరు దేశాల మధ్య నెలకొన్న విస్తృత విభేదాల నేపథ్యంలో ఈ తాజా మాటల యుద్ధం చోటుచేసుకుంది. ఐరాస వేదికగా ఇరు దేశాల ప్రతినిధులు ఎలాంటి వైఖరి తీసుకుంటారన్నది ఇప్పుడు అంతర్జాతీయ దౌత్యవర్గాల్లో ఆసక్తికరంగా మారింది