నారాయణగూడ, వెలుగు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో అమలవుతున్న వివిధ పథకాల్లో పని చేస్తున్న కార్మికులను ప్రభుత్వాలు బానిసలుగా చూస్తున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు విమర్శించారు. హిమాయత్‌నగర్‌లోని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యాలయంలో స్కీం వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలనే డిమాండ్‌పై సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఆశా, అంగన్‌వాడీ, మధ్యాహ్న భోజనం, ఎన్‌హెచ్‌ఎం, సీఆర్‌పీ, వీఏవో, మిషన్ భగీరథ, సెర్ప్, ఉపాధి హామీ తదితర పథకాల్లో 2.15 లక్షల మంది సేవలందిస్తున్నారని తెలిపారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ స్కీం కార్మికులకు పలు హామీలు ఇచ్చిందని, అధికారంలోకి వచ్చి మూడేళ్లు దగ్గర పడుతున్నా అమలు చేయకపోవడంతో కార్మికుల్లో నిరాశ నెలకొందన్నారు. ప్రభుత్వానికి కీలకమైన సేవలు అందిస్తున్న స్కీం వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. కనీసం కార్మికులుగానైనా గుర్తించి పీఎఫ్, ఈఎస్‌ఐ వంటి సౌకర్యాలు కల్పించాలని కోరారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో స్కీం కార్మికుల సమస్యలను ప్రస్తావిస్తానని హామీ ఇచ్చారు. హక్కుల సాధనకు కార్మికులు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. నేతలు బీవీ విజయలక్ష్మి, ఎం.నరసింహ, వీఎస్ బోస్, ఎండీ యూసుఫ్, ఎస్.బాలరాజ్, పి.ప్రేమ్ పావని, ఎన్.కరుణకుమారి పాల్గొన్నారు