వేములవాడ, ఆంధ్రప్రభ: దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి దేవస్థానంలో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌తో కలిసి ఆలయానికి చేరుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్‌కు అర్చకులు, వేద పండితులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. పూజల అనంతరం వేద పండితులు మంత్రి పొన్నం ప్రభాకర్, విప్ ఆది శ్రీనివాస్‌కు వేదాశీర్వచనం అందించారు. ఆలయ డిప్యూటీ ఈవో ప్రతాప నవీన్ కుమార్ స్వామివారి శేషవస్త్రం, లడ్డూ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. కొత్తకొండ వీరభద్ర స్వామివారి నక్షత్రమాల ధరించిన అనంతరం వేములవాడ శ్రీ భీమేశ్వర స్వామివారిని దర్శించుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో సుభిక్షంగా వర్ధిల్లాలని, ఎలాంటి కరువు కాటకాలు లేకుండా ప్రజలంతా పాడిపంటలతో, ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో జీవించాలని స్వామివారిని మనస్ఫూర్తిగా ప్రార్థించినట్లు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, పార్టీ పట్టణ అధ్యక్షుడు తూము మధు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రాకేష్, పాత సత్యలక్ష్మి, నాగుల విష్ణు, రంగు వెంకటేష్, రాంబాబు, ఆలయ పర్యవేక్షకులు శ్రీనివాస్ శర్మ, పీఆర్వో పెరిక శ్రీనివాస్, ఆలయ ఉద్యోగులు, అర్చక బృందం, వేద పండితులు, స్థానిక ప్రజాప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు