Kaizer News

Yerragondapalem: యర్రగొండపాలెంలో తీవ్రస్థాయికి చేర

Yerragondapalem: యర్రగొండపాలెంలో తీవ్రస్థాయికి చేరిన కోతుల బెడద!

· State - Telangana · hmtvlive.com

Shorts Yerragondapalem: యర్రగొండపాలెం పట్టణంలో కోతుల బెడద ప్రజల నిత్యజీవితాన్ని అతలాకుతలం చేస్తోంది. వందల సంఖ్యలో గుంపులుగా సంచరిస్తున్న కోతులు వీధులను తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు వ్యవహరిస్తుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఉదయం ఇంటి తలుపు తెరవాలన్నా, సాయంత్రం ఇంటికి చేరాలన్నా ముందుగా బయట కోతులు ఉన్నాయో లేదో చూసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. పాఠశాలలకు వెళ్లే చిన్నారులు తల్లిదండ్రులు లేదా పెద్దలతో కలిసి మాత్రమే బయటకు వస్తున్నారు. ఒంటరిగా నడిస్తే కోతులు వెంటపడతాయనే భయంతో పిల్లలు వణికిపోతున్నారు. కొందరు తల్లిదండ్రులు పిల్లలను బడికి పంపడానికే భయపడుతున్నామని చెబుతున్నారు. మందులు తెచ్చుకోవడానికి, దేవాలయానికి వెళ్లడానికి లేదా నిత్యావసరాల కోసం బయటకు రావాల్సిన వృద్ధులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని నడవాల్సి వస్తోంది. చేతిలో కర్ర లేకుండా బయటకు వెళ్లే ధైర్యం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంటిపనుల కోసం, కూరగాయలు కొనుగోలు చేయడానికి లేదా తాగునీటి కోసం బయటకు వచ్చే మహిళలు కోతుల దాడుల భయంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చేతిలో సంచులు కనిపిస్తే కోతులు లాక్కుంటున్నాయని, చిన్నపిల్లలను తీసుకుని బయటకు రావాలంటే మరింత భయంగా ఉంటోందని చెబుతున్నారు. పట్టణంలో ఏ వీధిలోకి వెళ్లినా చేతిలో కర్రతో కనిపించే ప్రజలే ఎక్కువగా కనిపిస్తున్నారు. ఒంటరిగా వెళ్లకుండా నలుగురైదుగురు కలిసి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాత్రివేళల్లో జాతీయ రహదారిపై సైతం కోతులు గుంపులుగా సంచరిస్తుండటంతో బయట నుంచి వచ్చే వారు ఇంటికి చేరుకోవడానికే భయపడుతున్నారు. కోతుల సమస్యను పలుమార్లు పంచాయతీ కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేదని ప్రజలు వాపోతున్నారు.గతంలో ఇలాంటి పరిస్థితి నెలకొన్నప్పుడు అప్పుడు ఇదే పంచాయతీలో గతంలో పనిచేసిన పంచాయతీ కార్యదర్శి కొండముచ్చును తెప్పించి కోతులను గ్రామ శివార్లకు తరలించిన విషయం విధితమే ఇప్పుడు కూడా అదే చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. ప్రమాదం మరింత పెరగకముందే అధికారులు స్పందించి ప్రజలకు భరోసా కల్పించాలని యర్రగొండపాలెం వాసులు విజ్ఞప్తి చేస్తున్నారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News