Kaizer News

Tirumala Brahmotsavam: తిరుమలలో మోహినీ అవతార వాహన

Tirumala Brahmotsavam: తిరుమలలో మోహినీ అవతార వాహన సేవ.. భక్తుల సౌకర్యాలపై అధికారుల ఆరా!

· State - Telangana · tv9telugu.com

Tirumala Brahmotsavam: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదవ రోజైన శనివారం ఉదయం మోహినీ అవతార వాహన సేవ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, అదనపు ఈఓ వెంకయ్య చౌదరి, చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ (సీవీఎస్ఓ) కె.వి. మురళీకృష్ణ, ఎస్వీబీసీ చైర్మన్ బి. శ్రీధర్ వర్మతో పాటు పలువురు అధికారులు గ్యాలరీల్లోని భక్తులను కలిశారు. భక్తులకు అందుతున్న సౌకర్యాలు, ఆహారం, తాగునీరు, ప్రసాదాల పంపిణీ తదితర అంశాలపై అధికారులు ఆరా తీశారు. భక్తులకు అందిస్తున్న ప్రసాదాలను అదనపు ఈఓ వెంకయ్య చౌదరి స్వయంగా రుచి చూసి పరిశీలించారు. భక్తులకు ఏమైనా ఇబ్బందులు ఎదురైతే తన దృష్టికి నేరుగా తీసుకురావచ్చని ఆయన తెలిపారు. అయితే, తమకు ఎలాంటి అసౌకర్యం లేదని, అన్ని సౌకర్యాలు సక్రమంగా అందుతున్నాయని భక్తులు అధికారులకు తెలిపారు. దీంతో అధికారులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా, ఎస్వీబీసీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన బి. శ్రీధర్ వర్మను కనుమూరి బాపిరాజు కలిసి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన శ్రీధర్ వర్మకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. అనంతరం శ్రీధర్ వర్మ కృతజ్ఞతలు తెలిపారు. కనుమూరి బాపిరాజు ఆరోగ్యంగా ఉండాలని, శ్రీవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులో ఆయన నుంచి విలువైన సలహాలు, సూచనలు అందుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో 19వ వార్డు టీడీపీ కార్యకర్తలు పెంచలయ్య, మణికంఠ, అయ్యప్ప తదితరులు పాల్గొన్నారు

Original source: tv9telugu.com
Read more on Kaizer News