Kaizer News

రక్తస్రావంతో గర్బిణి మృతి.. కేసు నమోదు

రక్తస్రావంతో గర్బిణి మృతి.. కేసు నమోదు

· State - Telangana · ntnews.com

పెన్‌ప‌హాడ్‌, ఆగస్టు 29 : పెన్‌ప‌హాడ్ మండల పరిధిలోని దోసపహడ్ గ్రామానికి చెందిన వలపట్ల జానకమ్మ భర్త వీరయ్య దంపతుల కూతురు నాగమణిని 8 సంవత్సరాల క్రితం మండల పరిధిలోని నాగులపాటి అన్నారం గ్రామానికి చెందిన మీసాల నాగరాజు ఇచ్చి వివాహం చేశారు. వారికి 8 సంవత్సరాల తర్వాత నాగమణికి గ‌ర్భం అందింది. కాగా మీసాల నాగమణి (25) గురువారం రాత్రి ప్రసవ నొప్పులతో పెన్‌ప‌హాడ్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చేరింది. శుక్రవారం ఉదయం నొప్పులు అధికం కావడంతో నర్సింగ్ అధికారులు స్వర్ణలత, వినోద్ ఆధ్వర్యంలో ప్రసవం నిర్వహించారు. నాగమణి ఆడబిడ్డకు జన్మనివ్వగా తల్లీబిడ్డ తొలుత ఆరోగ్యంగానే ఉన్నట్లు సమాచారం. అయితే ప్రసవం అనంతరం గర్భాశయంలోని మాయ (ప్లాసెంటా) తొలగించడంలో ఇబ్బంది ఏర్పడింది. మాయను తొలగించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో విషయాన్ని జిల్లా ప్రోగ్రాం అధికారికి సమాచారం అందించి నాగమణిని సూర్యాపేట జనరల్ ఆస్ప‌త్రికి తరలించారు. అప్పటికే ఆమెకు అధిక రక్తస్రావం జరిగినట్లు తెలిసింది. జనరల్ ఆసుపత్రిలో వైద్యులు మాయను తొలగించి చికిత్స అందించారు. ఐసీయూలో చికిత్స పొందుతూ.. శుక్రవారం సాయంత్రం 5.30 గంటల సమయంలో నాగమణి రక్తపోటు ఒక్కసారిగా పడిపోవడంతో పాటు హార్ట్ బీట్ లో వ్యత్యాసం ఏర్పడింది. దీంతో ఆమెను ఐసీయూకు తరలించి అత్యవసర చికిత్స అందించినప్పటికీ శుక్రవారం రాత్రి మృతి చెందినట్లు హాస్పటల్ సిబ్బంది తెలిపారు. మృతురాలి తల్లి వలపట్ల జానకమ్మ శనివారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు మృతికి కారకులైన ఈ.స్వర్ణలత @ ఎం.వినోద్ జిన్సి డాక్టర్ రాజేష్ పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ బాలు నాయక్ తెలిపారు

Original source: ntnews.com
Read more on Kaizer News