Kaizer News

అలసత్వంపై వేటు!

· State - Telangana · sakshi.com

సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : అటవీ భూముల ఆక్రమణలకు పాల్పడకుండా చూడాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై జిల్లా అటవీ అధికారి నీరజ్‌కుమార్‌ సీరియస్‌ అయ్యారు. బాధ్యులపై కొరడా ఝుళిపిస్తున్నారు. ఇటీవల జిల్లాలోని ఎల్లారెడ్డి రేంజ్‌ పరిధిలో ముగ్గురు అధికారులపై సస్పెన్షన్‌ వేటు వేశారు. మరికొందరిపైనా విచారణ జరుగుతోంది. రేంజ్‌ పరిధిలో శెట్పల్లి బీట్‌ ఆఫీసర్‌గా పనిచేసిన శ్యాంసుందర్‌, జల్దిపల్లి బీట్‌ ఆఫీసర్‌ శేఖర్‌రెడ్డి, బొల్లారంలో సెక్షన్‌ ఆఫీసర్‌ విక్కీ మార్టిన్‌లు సస్పెన్షన్‌కు గురయ్యారు. జిల్లాలో ఇప్పటికే వేలాది ఎకరాల్లో అడవులు ఆక్రమణలకు గురయ్యాయి. ఆక్రమణకు గురైన అటవీ భూములను స్వాధీనం చేసుకునేందుకు ఒకవైపు చర్యలు తీసుకుంటుండగా.. మరోవైపు అడవులు నరికివేతకు పాల్పడుతున్న సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. దీనిని జిల్లా అటవీ అధికారి సీరియస్‌గా తీసుకున్నారు. అటవీ భూముల్లో ట్రాక్టర్లతో దున్నితే వెంటనే సీజ్‌ చేయాలని ఆయా రేంజ్‌లలో అధికారులకు స్పష్టమైన ఆదేశాలున్నాయి. కొన్ని ప్రాంతాల్లో అటవీ అధికారులు అటవీ భూముల్లో దున్నకాలు జరిపిన ట్రాక్టర్లను సీజ్‌ చేస్తున్నారు. అయితే ఎల్లారెడ్డి రేంజ్‌ పరిధిలో కట్టడి చేయడంలో అధికారులు విఫలమయ్యారన్న ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో డీఎఫ్‌వో నీరజ్‌కుమార్‌ ఆయా ప్రాంతాలపై దృష్టి సారించారు. ఎక్కడెక్కడ ఆక్రమణలు జరుగుతున్నాయి? అటవీ అధికారులు ఏం చేస్తున్నారు? అన్న అంశాలపై ఆరా తీశారు. ఆక్రమణలు జరగకుండా కట్టడి చేయాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు గుర్తించి ఆయన సీరియస్‌గా స్పందించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన ముగ్గురిపై వివిధ సందర్భాల్లో సస్పెన్షన్‌ వేటు వేశారు. మరికొందరిపైనా విచారణ జరుగుతున్నట్లు తెలుస్తోంది. డ్యూటీ విషయంలో నిర్లక్ష్యం క్షమించరానిది. అలాంటి వారిపై చర్యలు తప్పవు. జిల్లాలో ఇప్పటికే ముగ్గురు సస్పెండ్‌ అయ్యారు. సర్కిల్‌ ఆఫీస్‌ ద్వారా శాఖాపరమైన విచారణ జరుగుతోంది. అటవీ సంరక్షణకు ఎవరి పరిధిలో వారు బాధ్యతగా విధులు నిర్వహించాలి. – నీరజ్‌ కుమార్‌, జిల్లా అటవీ అధికారి, కామారెడ్డి అడవుల నరికివేత, భూముల ఆక్రమణలు జరగకుండా నిరోధించాల్సిన ఉద్యోగులు.. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించడంపై డీఎఫ్‌వో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సస్పెన్షన్‌ వేటు వేస్తున్నారు. దీంతో ఉద్యోగుల్లో వణుకు మొదలైంది. జిల్లాలో కామారెడ్డి, ఎల్లారెడ్డి, మాచారెడ్డి, గాంధారి, బాన్సువాడ తదితర రేంజ్‌ల పరిధిలో గతంలో వేలాది ఎకరాల్లో అటవీ భూములు ఆక్రమణలకు గురయ్యాయి. పోడు సేద్యం చేస్తున్న గిరిజనులకు అప్పట్లో ఆర్‌వోఎఫ్‌ఆర్‌ పట్టాలు వచ్చాయి. అయితే చాలాచోట్ల కొత్తగా అడవులను నరికివేస్తుండడాన్ని ప్రభుత్వం సైతం సీరియస్‌గా తీసుకుంటోంది. కొత్తగా అడవులు ఆక్రమణలకు గురికాకుండా చూడాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో క్షేత్ర స్థాయిలో పనిచేసే అధికారులు, సిబ్బంది నిరంతరం అడవులపై నిఘా పెట్టాల్సి ఉంటుంది. కొన్నిచోట్ల అటవీ అధికారుల కన్నుగప్పి చెట్లను నరికివేసి దున్నకాలు సాగిస్తుండడం ఉద్యోగులకు ఇబ్బందికరంగా మారింది. కొన్ని ప్రాంతాల్లో అడ్డుకున్న ఉద్యోగులపై దౌర్జన్యాలు కూడా జరిగా

Original source: sakshi.com
Read more on Kaizer News