జుక్కల్/కామారెడ్డి, ఆంధ్రప్రభ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీలో సాంకేతిక లోపాలు వెలుగులోకి వచ్చాయి. జుక్కల్ మండలంలోని పెద్దఎడ్గి గ్రామంలో పంపిణీ చేసిన రేషన్ కార్డుల్లో గ్రామం పేరు తప్పుగా ముద్రితమైంది. దీంతో లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం పెద్దఎడ్గి గ్రామంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన సుమారు 995 మంది లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులు అందించారు. కార్డులు అందుకున్న లబ్ధిదారులు వాటిని పరిశీలించడంతో అసలు విషయం బయటపడింది. కార్డుల్లో తమ గ్రామం పేరు ‘పెద్దఎడ్గి’ కి బదులుగా ‘సోపూర్’ గా ముద్రించి ఉంది. తమ వివరాల్లో గ్రామం పేరు కూడా తప్పుగా ఉండటంతో లబ్ధిదారులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. కార్డులు పంపిణీకి ముందే వివరాలను పరిశీలించాల్సిన అధికారులు ఈ తప్పును ఎలా గుర్తించలేదని ప్రశ్నించారు. తప్పును గుర్తించిన పలువురు లబ్ధిదారులు వెంటనే గ్రామపంచాయతీ కార్యాలయానికి వెళ్లారు. తమ సమస్యను సర్పంచ్, కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లారు. సర్పంచ్ అస్పత్వర్ అనిల్ కుమార్, కార్యదర్శి రమేష్ చారికి వినతిపత్రం అందించారు. రేషన్ కార్డుల్లో తప్పుగా ముద్రించిన గ్రామం పేరును సరిచేయాలని కోరారు. తమకు సరైన వివరాలతో స్మార్ట్ రేషన్ కార్డులు అందించాలని విజ్ఞప్తి చేశారు. భవిష్యత్‌లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరారు. ఒకటి రెండు కార్డుల్లో కాకుండా పెద్ద సంఖ్యలో కార్డుల్లో ఒకే తప్పు కనిపించడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సుమారు 995 మంది లబ్ధిదారుల కార్డులకు సంబంధించిన వివరాల్లో ఈ సమస్య ఉండటంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కార్డుల ముద్రణ అనంతరం పంపిణీకి ముందు అధికారులు వివరాలను పూర్తిగా పరిశీలించాల్సి ఉందని గ్రామస్తులు పేర్కొన్నారు. అయితే ఈ ప్రక్రియలో నిర్లక్ష్యం జరిగిందని ఆరోపించారు. తమ గ్రామానికి సంబంధించిన కార్డుల్లో మరో గ్రామం పేరు ఉండటం వల్ల భవిష్యత్‌లో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేశారు. స్మార్ట్ రేషన్ కార్డులు ప్రభుత్వ పథకాల అమలులో కీలకమైన పత్రాలని గ్రామస్తులు పేర్కొన్నారు. అందులో ప్రాథమిక వివరాలే తప్పుగా ఉంటే లబ్ధిదారులకు ఇబ్బందులు తప్పవని అన్నారు. అందువల్ల పెద్దఎడ్గి గ్రామానికి చెందిన లబ్ధిదారుల కార్డుల్లో ఉన్న తప్పులను వెంటనే సరిచేయాలని డిమాండ్ చేశారు. సరైన వివరాలతో కొత్త కార్డులు అందించాలని కోరారు. సాంకేతిక లోపం ఎక్కడ జరిగిందో గుర్తించి.. భవిష్యత్‌లో ఇలాంటి తప్పులు పునరావృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు