Visakhapatnam: గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించి, వారిని జాతీయ స్థాయి విద్యాసంస్థల్లో చదివించాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గిరిజన విద్యార్థుల విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపరిచి, IITలు, NITలు, AIIMS, వైద్య కళాశాలలు వంటి దేశంలోని ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో వారి ప్రాతినిధ్యాన్ని పెంచేందుకు విశాఖపట్నం జిల్లా మారికవలసలోని రెసిడెన్షియల్ స్కూల్‌లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్(CoE)ను ఏర్పాటు చేశారు. గిరిజన విద్యార్థులకు బంగారు భవిష్యత్ అందించాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆకాంక్షలకు అనుగుణంగా ఈ కేంద్రాన్ని తీర్చిదిద్దుతున్నట్లు గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. మారికవలస సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో ఇంటర్మీడియట్ విద్యనభ్యసించే 600 మంది ప్రతిభావంతులైన ఎస్టీ విద్యార్థులకు పూర్తి స్థాయి రెసిడెన్షియల్ విద్యా సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఇందులో 300 మంది బాలురు, 300 మంది బాలికలు ఉంటారు. విద్యార్థుల ఎంపికను ప్రతిభ ఆధారంగా చేపట్టారు. ఎంపికైన విద్యార్థులకు విద్యతో పాటు వసతి, భోజనం, ఇతర అవసరమైన సౌకర్యాలు అందించనున్నారు. ముఖ్యంగా NEET, IIT-JEE వంటి జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడం ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో ప్రధాన అంశంగా ఉంది. గిరిజన విద్యార్థులు కేవలం పాఠశాల, ఇంటర్మీడియట్ స్థాయిలోనే కాకుండా ఉన్నత విద్యలోనూ రాణించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని మంత్రి సంధ్యారాణి తెలిపారు. గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన విద్యార్థులకు సరైన మార్గదర్శకత్వం, నాణ్యమైన కోచింగ్ అందితే వారు దేశంలోని అత్యుత్తమ విద్యాసంస్థల్లో సీట్లు సాధించగలరని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే NEET, IIT-JEE వంటి అత్యంత పోటీ పరీక్షలకు విద్యార్థులను చిన్న వయసు నుంచే సిద్ధం చేసే విధంగా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసింది. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో నాణ్యమైన కోచింగ్ అందించేందుకు నోయిడాకు చెందిన M/s Physics Wallah సంస్థను కోచింగ్ ఏజెన్సీగా నియమించారు. ఇప్పటికే 18 మంది ఫ్యాకల్టీ విధుల్లో చేరారు. కోచింగ్ తరగతులు కూడా ప్రారంభమయ్యాయి. అనుభవజ్ఞులైన అధ్యాపకుల ద్వారా విద్యార్థులకు పోటీ పరీక్షల సిలబస్‌తో పాటు పరీక్షల విధానం, సమయ నిర్వహణ, ప్రశ్నల సాధన, మాక్ టెస్టులు వంటి అంశాల్లో శిక్షణ ఇవ్వనున్నారు. విద్యార్థుల భవిష్యత్‌కు అంతరాయం లేకుండా చర్యలు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు నేపథ్యంలో మారికవలస రెసిడెన్షియల్ స్కూల్‌లో చదువుతున్న విద్యార్థుల విద్యకు ఎలాంటి అంతరాయం కలగకుండా ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. అక్కడ చదువుతున్న విద్యార్థులను దశలవారీగా School of Excellence, Marikavalasa, APSWREIS, APTWR సంస్థలకు బదిలీ చేశారు. విద్యా సంవత్సరం మధ్యలో విద్యార్థుల చదువుకు ఆటంకం కలగకుండా అవసరమైన చర్యలు తీసుకున్నామని ప్రభుత్వం స్పష్టం చేసింది. మారికవలస పాఠశాలలో మొత్తం 445 మంది విద్యార్థులు చదువుతున్నారని మంత్రి సంధ్యారాణి తెలిపారు. వారిలో 411 మంది విద్యార్థులు ఇప్పటికే వేర్వేరు పాఠశాలల్లో చేరి, అక్కడ చక్కగా చదువుకుంటున్నారని చెప్పారు. అయితే