లాంగ్ జంప్‌లో సాయి ప్రీతి, షాట్‌పుట్‌లో అఫిఫా ఉన్నీసా ప్రతిభ విద్యార్థినులను అభినందించిన కళాశాల ప్రిన్సిపాల్ షగుఫ్తా బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : క్రీడల్లో బెల్లంపల్లి మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాల, జూనియర్ కళాశాల విద్యార్థినులు విశేష ప్రతిభ కనబరిచారు. మంచిర్యాలలో ఈ నెల 19న నిర్వహించిన జిల్లా స్థాయి క్రీడా పోటీల్లో ప్రతిభ కనబరిచిన ఇద్దరు విద్యార్థినులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఆదివారం కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రిన్సిపాల్ షగుఫ్తా ఫిర్దౌస్ సిబ్బందితో కలిసి విద్యార్థినులను అభినందించారు. పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థిని సాయి ప్రీతి లాంగ్‌జంప్ విభాగంలో ప్రథమ బహుమతి సాధించి రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించింది. అలాగే కళాశాల ద్వితీయ సంవత్సరం బైపీసీ విద్యార్థిని అఫిఫా ఉన్నీసా షాట్‌పుట్ పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైంది. జిల్లా స్థాయిలో అద్భుత ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయికి ఎంపికైన విద్యార్థినులను ప్రిన్సిపాల్ షగుఫ్తా ఫిర్దౌస్, అధ్యాపకులు, ఉపాధ్యాయులు, సిబ్బంది ప్రత్యేకంగా అభినందించారు. రాష్ట్రస్థాయి క్రీడా పోటీల్లోనూ ఉత్తమ ప్రతిభ కనబరిచి విజయకేతనం ఎగురవేయాలని, పాఠశాలకు, ప్రాంతానికి మంచి గుర్తింపు తీసుకురావాలని ఆకాంక్షించారు