Kaizer News

మన్నె క్రిశాంక్‌కు ఊరట

మన్నె క్రిశాంక్‌కు ఊరట

· State - Telangana · ntnews.com

అరెస్టు చేయరాదన్న హైకోర్టు హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 18 (నమస్తే తెలంగాణ): బీఆర్‌ఎస్‌ సామాజిక మాధ్యమాల కన్వీనర్‌ మన్నె క్రిశాంక్‌కు న్యాయస్థానంలో ఊరట లభించింది. సైఫాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌లో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పీఏ, పీఆర్వోల విచారణకు సంబంధించిన వ్యవహారాన్ని సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడంపై నమోదైన కేసులో క్రిశాంక్‌ను అరెస్టు చేయరాదని, బీఎన్‌ఎస్‌ఎస్‌లోని 35(3) కింద ఆయనకు నోటీసు జారీచేసి విచారణ చేపట్టాలని హైకోర్టు ఆదేశించింది. తనపై నమోదైన కేసును చట్టప్రకారం దర్యాప్తు చేసేలా ఆదేశించాలని కోరుతూ క్రిశాంక్‌ దాఖలు చేసిన అత్యవసర పిటిషన్‌పై జస్టిస్‌ టీ మాధవీదేవి శుక్రవారం విచారణ చేపట్టారు. పోలీసులు ఇప్పటికే నిందితుడిని అరెస్టు చేసి, కోర్టులో హాజరుపర్చారని ప్రభుత్వ న్యాయవాది మహేశ్‌ రాజే చెప్పడంతో.. పిటిషనర్‌ తరఫు నాయవాది జోక్యం చేసుకున్నారు. క్రిశాంక్‌ ఇంకా అరెస్ట్‌ కాలేదని, ఆయనను మేజిస్ట్రేట్‌ రిమాండ్‌కు పంపలేదని తెలిపారు. దీంతో పిటిషనర్‌ను అరెస్ట్‌ చేయరాదని, చట్టప్రకారం నోటీసులు జారీచేసి విచారించాలని న్యాయమూర్తి పోలీసులను ఆదేశించారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను పోలీసులకు తెలియజేయాలని ప్రభుత్వ న్యాయవాదికి స్పష్టం చేశారు

Original source: ntnews.com
Read more on Kaizer News