Kaizer News

కండ్లన్నీ కార్లోస్‌పైనే..

కండ్లన్నీ కార్లోస్‌పైనే..

· Sports · ntnews.com

నేటి నుంచే యూఎస్‌ ఓపెన్‌ న్యూయార్క్‌: ఈ ఏడాది ఆఖరి గ్రాండ్‌స్లామ్‌ టోర్నమెంట్‌ యూఎస్‌ ఓపెన్‌ పోరుకు తెరలేచింది. ఆదివారం మొదలయ్యే ఈ మెగా టోర్నీలో సత్తా చాటేందుకు మేటి ఆటగాళ్లంతా సిద్ధమయ్యారు. వరల్డ్‌ నంబర్‌ వన్‌ యానిక్‌ సినర్‌ మోకాలి గాయం తగ్గకపోవడంతో టోర్నీ నుంచి తప్పుకోగా, డిఫెండింగ్‌ చాంపియన్‌ కార్లోస్‌ అల్కరాజ్‌ (స్పెయిన్‌) నాలుగు నెలల సుదీర్ఘ గాయం విరామం తర్వాత ఈ టోర్నీతోనే రీఎంట్రీ ఇస్తున్నాడు. దాంతో అందరి దృష్టి అతనిపై ఉండనుంది. ఈ ఏడాది ప్రారంభంలో ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గెలిచినప్పటికీ, గత నాలుగు నెలలుగా మ్యాచ్‌ ప్రాక్టీస్‌ లేకపోవడం అతనికి పెద్ద సవాలుగా మారనుంది. మరోవైపు 24 గ్రాండ్‌స్లామ్స్‌ విన్నర్‌, 39 ఏండ్ల నొవాక్‌ జొకోవిచ్‌ (సెర్బియా) వయసు ప్రభావంతో పాటు సిన్సినాటిలో వేడిని తట్టుకోలేక తొలి రౌండ్‌లోనే ఓడాడు. సినర్‌ గైర్హాజరీ, అల్కరాజ్‌, జొకో పూర్తి స్థాయిలో సిద్ధంగా లేకపోవడంతో ఫ్రెంచ్‌ ఓపెన్‌ విజేత అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ టాప్‌ సీడ్‌గా ఫేవరెట్‌గా బరిలోకి దిగుతుండగా.. సిన్సినాటి టైటిల్‌ గెలిచిన ఆర్థర్‌ ఫిల్స్‌, మాజీ చాంపియన్‌ మెద్వెదెవ్‌, డి మినార్‌ కూడా ట్రోఫీ వేటలో ముందంజలో ఉన్నారు. మహిళల విభాగంలో యూఎస్‌ ఓపెన్‌ హ్యాట్రిక్‌ టైటిల్‌పై కన్నేసిన బెలారస్‌ స్టార్‌, వరల్డ్‌ నంబర్‌ వన్‌ అరీనా సబలెంక తీవ్ర ఒత్తిడిలో ఉంది. వింబుల్డన్‌ నాలుగో రౌండ్‌లోనే నిష్క్రమించిన ఆమె, ఆ తర్వాత ఆడిన రెండు హార్డ్‌ కోర్ట్‌ టోర్నీల్లోనూ ఆరంభ రౌండ్లలోనే వెనుదిరిగింది. ఈ వరస వైఫల్యాల వల్ల ఆమె టాప్‌ ర్యాంక్‌ ప్రమాదంలో పడింది. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ చాంప్‌ రిబకినా, ప్రపంచ మూడో ర్యాంకర్‌ పెగులా, కోకో గాఫ్‌ అగ్రస్థానంతో పాటు ట్రోఫీకి గురిపెట్టారు

Original source: ntnews.com
Read more on Kaizer News