పెద్దమ్మకాడి తండా ఆదర్శ గ్రామం దిశగా అడుగులు భీమ్‌గల్ రూరల్ ఆంధ్రప్రభ: భీమ్‌గల్ మండలంలోని మారుమూల గ్రామమైన పెద్దమ్మకాడి తండా నీటి సంరక్షణ పనుల్లో ఆదర్శంగా నిలుస్తోంది. సికింద్రాపూర్ గ్రామ పంచాయతీ నుంచి కొత్తగా ఏర్పడిన ఈ తండాలో వీబీజీ ఆర్‌జెఎం పథకం ద్వారా నీటి నిల్వ, భూగర్భ జలాల పెంపు పనులను గ్రామస్తులు సమష్టిగా చేపడుతున్నారు. ఇప్పటికే మూడు వ్యవసాయ నీటి కుంటలను పూర్తి చేసి జిల్లాలో ఆదర్శంగా నిలుస్తున్నారు. గ్రామంలో నీటి కుంటల ప్రాధాన్యంపై నిర్వహించిన అవగాహన కార్యక్రమాలు గ్రామస్తుల్లో చైతన్యం తీసుకువచ్చాయి. సర్పంచ్ భూక్య రమేష్ ప్రత్యేక చొరవతో వర్షపు నీటిని భూమిలోకి ఇంకింపజేసే చర్యలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రతి ఇంటికి ఇంకుడు గుంత, మురుగు నీటి కాల్వలు లేని గ్రామంగా తీర్చిదిద్దేందుకు వీబీజీఆర్ఎంజే సిబ్బంది ప్రణాళికాబద్ధంగా పనులు చేపడుతున్నారు. ఇప్పటికే గ్రామంలో 20 ఇంకుడు గుంతలు, మూడు కమ్యూనిటీ ఇంకుడు గుంతలు, ఒక రూఫ్‌టాప్ రెయిన్‌వాటర్ హార్వెస్టింగ్ నిర్మాణం పూర్తి చేశారు. జీవనోపాధి మెరుగుదలలో భాగంగా ఆరు పశువుల షెడ్లు నిర్మించారు. ‘వర్షపు నీటిని, వాడిన నీటిని మన భూమిలోనే ఇంకించాలి’’ అనే నినాదంతో గ్రామస్తులు పనుల్లో భాగస్వాములవుతున్నారు. గంగాదేవిపల్లి,ఇబ్రహీంపూర్ గ్రామాల స్ఫూర్తితో పెద్దమ్మకాడి తండా ప్రజలు కూడా అభివృద్ధి పనుల్లో చురుకుగా పాల్గొంటున్నారు.ఇటీవల జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి జి. సాయన్న గ్రామాన్ని సందర్శించి గ్రామస్తుల చైతన్యాన్ని అభినందించారు. ప్రతి పథకాన్ని సద్వినియోగం గ్రామంలో గ్రామపంచాయతీ భవనం, పాఠశాల ప్రహరీ, పాఠశాల మరుగుదొడ్లు, గ్రామ సంఘ భవనం, పశువుల తొట్టి, నర్సరీ, స్మశానవాటిక, పల్లె ప్రకృతి వనం, ప్లాంటేషన్, సీసీ రోడ్లు తదితర అభివృద్ధి పనులను చేపట్టారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుంటూ గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నారు